న్యూయార్క్:ప్రపంచ ఆరోగ్య సంస్థకు జాతి, కుల, మత, వర్ణ బేధాలు లేవని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోన్ అథనోమ్ స్పష్టం చేశారు.

కరోనా వైరస్ విషయంలో తమను తప్పుదారి పట్టించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థపై  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుకూలంగా  వ్యవహరించిందని కూడ ట్రంప్ ఆరోపణలు చేశారు. 

ఈ ఆరోపణలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనా వైరస్ విషయంలో రాజకీయం చేయవద్దంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోన్ అథనోమ్ పిలుపునిచ్చారు.కరోనాను ఎదుర్కొనేందుకు అందరం కలిసికట్టుగా పోరాడడం ఒక్కటే మార్గమని ఆయన సూచించారు.

ప్రతి దేశానికి  తాము ఆత్మీయులమేనని టెడ్రోన్ చెప్పారు. ఒకటి జాతీయ సమైక్యతను పాటించడం, రెండవది ప్రపంచ సంఘీభావమన్నారు. ఈ వైరస్ ను రాజకీయం చేయడానికి బదులుగా  జాతీయ, అంతర్జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేయాలన్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: డబ్ల్యుహెచ్ఓపై ట్రంప్ సీరియస్

చైనా, అమెరికా, జీ-20 దేశాలే కాకుండా ప్రపంచమంతా కరోనా వ్యతిరేక పోరాటంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రపంచం చేస్తున్న యుద్దంలో ఈ క్లిష్ట పరిస్థితుల్లో  డబ్ల్యుహెచ్ఓకు మనం అండగా ఉండాలని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ అంటోనియో గుటెర్రాన్ కోరారు.