ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే కొందరు మాత్రం యధేచ్ఛేగా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారు. సాక్షాత్తూ నార్వే ప్రధాన మంత్రే వాటిని ఉల్లంఘించడంతో ఆమెకు పోలీసులు భారీ జరిమానా విధించారు.  

కరోనా వైరస్‌ విజృంభణ దృష్ట్యా నార్వేలో కొవిడ్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా 10 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే నార్వే ప్రధాని ఎర్నా సోల్‌బెర్గ్‌ గత నెలలో తన 60వ పుట్టినరోజు వేడుకను సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నారు.

ఆ కార్యక్రమంలో నిబంధనలను ఉల్లంఘించి 13 మంది పాల్గొన్నారు.  ఈ విషయం బయటకు రావడంతో ప్రధాని క్షమాపణలు చెప్పారు. భౌతిక దూరం ఆంక్షలకు విరుద్ధంగా ప్రధానమంత్రి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు గాను దాదాపు రూ.1.75 లక్షల జరిమానా (20వేల నార్వేజియన్‌ క్రోన్‌) విధించారు.

ఈ విషయాన్ని నార్వే పోలీస్‌ చీఫ్‌ ఓలేసావెయరడ్‌ వెల్లడించారు. నిబంధనలు పాటించని చాలా కేసుల్లో జరిమానా వేయలేదు. కానీ అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రధానమంత్రే రూల్స్‌ పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రధానమంత్రిని కూడా వదలకుండా కొవిడ్‌ నిబంధనలు, ఆంక్షల అమలుపై సామాన్య ప్రజల్లో విశ్వాసం కలుగుతుందని నార్వే పోలీసులు అభిప్రాయపడ్డారు.  కాగా, కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రధానమంత్రి ఎర్నా నేతృత్వంలో వైరస్ కట్టడికి నార్వేలో ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. దీంతో మిగిలిన దేశాలతో పోలిస్తే అక్కడ కరోనా కాస్త అదుపులోనే ఉంది. ఇప్పటి వరకు అక్కడ లక్షా రెండు వేల పాజిటివ్‌ కేసులు, 684 మంది ప్రాణాలు కోల్పోయారు.