బందీలను విడిచిపెట్టే వరకు గాజాకు తాగు నీరు, విద్యుత్, ఇంధనం బంద్: ఇజ్రాయెల్ వార్నింగ్
హమాస్ చెరలో ఉన్న బందీలు సురక్షితంగా ఇజ్రాయెల్‌కు వచ్చే వరకు గాజా స్ట్రిప్‌కు తాగు నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలు నిలిచే ఉంటాయని ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. బుధవారం పాలస్తీనాలోని ఏకైక పవర్ ప్లాంట్ కూడా ఇంధన లేక నిలిచిపోయిన సంగతి తెలిసిందే.
న్యూఢిల్లీ: హమాస్ గ్రూప్‌కు తాజాగా ఇజ్రాయెల్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ పై మెరుపుదాడి చేసి సుమారు 150 మంది ఇజ్రాయెల్ పౌరులను బంధించి తీసుకెళ్లిన హమాస్ వెంటనే ఆ బందీలను విడుదల చేయాలని ఆదేశించింది. ఆ బందీలను విడిచిపెట్టే వరకు గాజాకు తాగు నీరు, విద్యుత్, ఇంధనాన్ని ఆపేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఎనర్జీ మినిస్టర్ ఇజ్రాయెల్ కాజ్ గురువారం ఈ వార్నింగ్ ఇచ్చారు.
‘గాజాకు మానవతా సహాయం అందించడమా? హమాస్ బంధించిన ఇజ్రాయెలీ పౌరులు తమ దేశానికి తిరిగి వచ్చే వరకు విద్యుచ్ఛక్తి గాజాకు అందబోదు. నీటి కుళాయిలో నీరు రాదు. ఒక్క ఇంధన ట్రక్కు కూడా గాజాలోకి వెళ్లదు’ అని మంత్రి ఇజ్రాయెల్ కాజ్ పేర్కొన్నారు.
సుమారు 150 మంది ఇజ్రాయేలీలు, విదేశీయలు, రెండు పౌరసత్వాలున్న వారిని హమాస్ అపహరించింది. గాజా పట్టిలో నిర్బంధించింది. శనివారం ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో కనీసం 1200 మంది దుర్మరణం చెందారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పై విరుచుకుపడుతున్నది. భారీ ఎత్తున గగనతల దాడులు చేసింది. భారీ స్థాయిలో గ్రౌండ్ వార్‌కూ సిద్ధమవుతున్నది.
Also Read: భారతీయ వ్యాపారి నుంచి రూ. 4 కోట్లను దోచుకున్న హమాస్.. ఎలాగంటే?
ఇటీవలే గాజా అష్టదిగ్బంధనానికి ఇజ్రాయెల్ పిలుపు ఇచ్చింది. నీరు, ఇంధనం, విద్యుత్ సరఫరాలను నిలిపేసింది. బుధవారం నాటికి పాలస్తీనాలోని ఏకైకా పవర్ ప్లాంట్ కూడా ఇంధనం లేక ఆగిపోయింది. పాలస్తీనా అంధకారంలోనే ఉన్నది.
ఇజ్రాయెల్, ఈజిప్టుల నడుమ చిన్న పట్టిలా మధ్యదరా సముద్ర తీరాన గాజా స్ట్రిప్ ఉంటుంది. 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో ఉండే చిన్న భూభాగమే ఈ గాజా స్ట్రిప్. ఇంతటి తక్కువ ప్రదేశంలోనే 23 లక్షల మంది నివసిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక జనసాంధ్రత కలిగిన ప్రాంతాల్లో గాజా స్ట్రిప్ ఒకటి.
గాజా ఇప్పుడు ఒంటరి. పొరుగున ఉండే ఈ రెండు దేశాలతో దానికి సత్సంబంధాలు లేవు. గాజా సముద్ర తీరంలోని జలాలు, దాని గగనతలంపైనా అధికారం ఇజ్రాయెల్‌దే. గాజా సరిహద్దులనూ ఇజ్రాయెల్ నియంత్రిస్తున్నది. ఏ సరుకులు ఈ సరిహద్దుల గుండా, సముద్ర మార్గాన వెళ్లాలో కూడా ఇజ్రాయెల్ కంట్రోల్‌లోనే ఉన్నది. 2007 నుంచి ఈజిప్టు, ఇజ్రాయెల్ కలిసి గాజా పట్టిని దిగ్బంధిస్తున్నాయి. అందుకే గాజా పట్టిన బహిరంగ కారాగారం అంటారు.