టై కట్టుకునేందుకు నిరాకరించాడని ఓ పార్లమెంట్ సభ్యుడిని స్పీకర్ సభనుండి పంపించివేశాడు. న్యూజిల్యాండ్ లో జరిగిన ఈఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

న్యూజిల్యాండ్ పార్లమెంటులో పాశ్చాత్య దేశాల డ్రెస్ కోడ్ ను అమలు చేయడం, దాన్ని పాటించాల్సిందేనంటూ పార్లమెంట్ తనకు చెప్పడం తన హక్కులను ఉల్లంగించడమేనని అక్కడి మావోరీ పార్టీ నేత రావియొరి వాయిటీటీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశీయ సంస్కృతిని అణిచివేసే చర్య అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రావియొరి మంగళవారం సభలో టై కట్టుకోకుండా ప్రసంగిస్తుండడంతో స్పీకర్ ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశాడు. ఆ తరువాత టై కట్టుకోమని తెలిపారు. దీనికి రావియొరి నిరాకరించడంతో సభలోనుంచి బైటికి పంపించేశాడు. రావియొరి టైకు బదులుగా మావోరీ గ్రీన్ స్టోన్ లాకెట్ ను ధరించారు. 

టై కట్టుకోవడం కట్టుకోకపోవడం ముఖ్యం కాదు.. సాంస్కృతి గుర్తింపు ముఖ్యం అంటూ చాంబర్ నుంచి బయటికి వెళ్తూ రావియొరి స్పీకర్ తో అన్నారు. మంగళవారం జరిగిన ఈ ఘటన మీద బుధవారం ఆయన మరోసారి మాట్లాడుతూ తన చర్యలు టైల మీద కాదని, పార్లమెంట్‌లో అయినా పబ్‌లో అయినా మావోరీలు మావోరీలుగా ఉండే హక్కుపైన అని చెప్పారు. 

మావోరీ హక్కులను పాశ్చాత్య దేశాలకు చెందిన టై అణిచివేస్తోందని, అందుకనే తాను టైను తీసివేశానని ఆయన తెలిపారు. నిజానికి గతేడాదే రావియొరి, స్పీకర్ మధ్య ఈ టై అంశం చర్చకు వచ్చింది. 

గతేడాది పార్లమెంటులో ప్రసంగించే టైంలో రావియొరి టైని ఉరితో పోల్చారు. ఆ టైంలో స్పీకర్ టైల అంశంపై పార్లమెంట్ సభ్యుల అభిప్రాయాన్ని అడగ్గా.. మెజారిటీ సభ్యులు టై ఉంచాలంటూ ఆమోదించారు.

ఇక ఇదే విషయంపై న్యూజిల్యాండ్ ప్రధాని జకిండా ఆర్డర్స్ స్పందిస్తూ.. ఈ విషయంపై తనకు బలమైన అభిప్రాయం ఏమీ లేదన్నారు. పార్లమెంటులో టై కట్టుకున్నా లేకున్నా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. టై విషయం కంటే ముఖ్యమైన సమస్యలు దేశంలో చాలా ఉన్నాయంటూ ఆమె చెప్పారు.