నేపాల్ కేబినెట్  పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేసింది. నేపాల్  ప్రధాని కేపీ ఓలి నేతృత్వంలో కేబినెట్ ఆదివారం నాడు అత్యవసరంగా సమావేశమైంది.ఈ మేరకు పార్లమెంట్ ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకొంది.

ప్రధాని కేపీ శర్మ ఓలీ పార్టీ  పార్లమెంటరీ పార్టీలో మెజారిటీని కోల్పోయిందని నివేదికలు చెబుతున్నాయి.  సెంట్రల్ కమిటీ,  కమ్యూనిష్టు పార్టీ సెక్రటేరియట్  సభ్యుడు బిష్ణు రిజాల్ చెప్పారు.  నేపాల్ కమ్యూనిష్టు పార్టీ అధికారంలో ఉంది.

పార్లమెంట్ రద్దుకు కేబినెట్ చేసిన సిఫారసును  ప్రధాని ఓలి  ప్రెసిడెంట్ కు పంపారు. ఇదిలా ఉంటే కేబినెట్ నిర్ణయాన్ని నేపాల్ కమ్యూనిష్టు పార్టీ తప్పుబట్టింది. 2022లో నేపాల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ సమయంలో నేపాల్ పార్లమెంట్ కు కేబినెట్ సిఫారసు చేయడం  ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

మాజీ ప్రధాని పుష్పకమల్ దహల్ నేతృత్వంలో ఎన్‌సీపీ ప్రత్యర్ధి వర్గాల నుండి పీఎంఓలీ తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకొంది.

ప్రధాని ఓలి శనివారం నాడు సాయంత్రం  అధ్యక్షుడు బింద్యా దేవి బండారిని ఆమె అధికారిక నివాసంలో కలిశారు.   బుధవారం నాడు పార్టీ స్టాండింగ్ కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను  ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది.

శనివారం నాడు ప్రధాని ఓలి కమ్యూనిష్టు నేత ప్రచండ ఇంటికి వెళ్లారు. తనను తీవ్రంగా విమర్శించిన రాజకీయ పత్రం కూడా ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. కానీ వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.ఈ కారణంగానే ఓలి ఆదివారం నాడు అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ రద్దుకు  సిఫారసు చేశారని తెలుస్తోంది.