హిమాలయాల్లో కనిపించిన పెద్ద పెద్ద అడుగులను యతి అడుగులుగా భారత సైన్యం అనుమానం వ్యక్తం చేయడాన్ని నేపాల్ ఆర్మీ ఖండించింది. అవి మంచు ఎలుగుబంటి పాదముద్రలని.. భారత సైన్యం వాటిని గుర్తించిన ప్రాంతంలో ఎలుగుబంట్లు సంచరిస్తుంటాయని తెలిపింది.

హిమాలయాల్లో సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం ఏప్రిల్ 9న మకాలు బేస్ క్యాంప్ సమీపంలో ఓ వింత మనిషి అడుగులను గుర్తించింది. 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న పాదముద్రలను గుర్తించింది.

దీంతో ఇవి యతివేనని ఆర్మీ ట్వీట్టర్‌లో పేర్కొంది. గతంలోనూ మకాలు-బరున్ నేషనల్ పార్క్ సమీపంలో యతి అడుగులు కన్పించినట్లు సైన్యం తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆర్మీ ట్వీట్టర్‌లో పోస్ట్ చేసింది.

అయితే ఈ ఫోటోల్లో కేవలం ఒక కాలి ముద్రలు మాత్రమే ఉండటం పలు అనుమానాలకు తావిచ్చింది. దీనిపై శాస్త్రవేత్తలు సైతం భిన్నాభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ పాదయాత్రలను భారత ఆర్మీ గుర్తించిన సమయంలో నేపాల్ సైన్యానికి సంబంధించిన లియైజన్ బృందం కూడా ఉందని బ్రిగేడియర్ జనరల్ విజ్ఞాన్ దేవ్ పాండే మీడియాకు తెలిపారు.