Asianet News TeluguAsianet News Telugu

అంతుచిక్కని వ్యాధితో సూడాన్‌లో సుమారు 100 మంది మృతి.. అప్రమత్తమైన డబ్ల్యూహెచ్‌వో టాస్క్ ఫోర్స్

కరోనా మహమ్మారి రూపం మారుస్తూ ప్రజలను వణికిస్తుంటే ఇతర కొన్ని వ్యాధులు పంజా విసురుతున్నాయి. సూడాన్ దేశంలో ఓ అంతు చిక్కని వ్యాధి కోరలు చాస్తున్నది. ఆ వింత వ్యాధి కారణంగా ఇప్పటి వరకు సుమారు 100 మంది మరణించిచారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెంటనే రంగంలోకి దిగింది. ఓ టాస్క్ ఫోర్స్ బృందాన్ని సూడాన్‌కు పంపింది.

nearly 100 died with mystery disease.. WHO went there
Author
New Delhi, First Published Dec 15, 2021, 3:01 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(Corona Virus) రూపం మారుస్తూ భయాలను మళ్లీ మళ్లీ ముందుకు తెస్తున్నది. ఈ మహమ్మారికి అంతమే లేదా? అనేంతలా పంజా విసురుతున్నది. ఇలాంటి తరుణంలోనే ఉలిక్కిపడే వార్త ఒకటి సూడాన్ నుంచి వెలువడింది. ఓ అంతుచిక్కని వ్యాధితో ఆ దేశంలో సుమారు వంద మంది మృతి(Died) చెందారు. ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఈ వ్యాధి ముప్పు తిప్పలు పెడుతున్నది. ఈ వ్యవహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కూడా తక్షణమే స్పందించింది. వ్యాధిని పరిశోధించడాని(Investigation)కి ప్రత్యేక బృందాన్ని పంపింది.

దక్షిణా సూడాన్‌లో జోంగ్లీ రాష్ట్రంలోని ఫాంగాక్ పట్టణంలో ఈ అంతుచిక్కని వ్యాధి పంజా విసురుతున్నది. అధికారులు ఆ పేషెంట్ల నుంచి నమూనాలు స్వీకరించారు. కలరా టెస్టు చేయగా నెగెటివ్ వచ్చినట్టు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఆ దేశానికి పంపింది. ఆ వ్యాధి తీవ్రత, ముప్పును పరిశీలించాల్సిందిగా ఆ బృందాన్ని ఆదేశించింది. వ్యాధిపైనా ఆ బృందం పరిశోధనలు చేయనున్నట్టు డబ్ల్యూహెచ్‌వోకు చెందిన షీల బాయా వెల్లడించారు.

Also Read: 600 మందికి వింత వ్యాధి, అధ్యయనాలు సాగుతున్నాయి: ఆళ్ల నాని

అందుకే టాస్క్ ఫోర్స్ సూడాన్ చేరుకుందని తెలిపారు. ఆ వ్యాధితో బాధపడుతున్న వారి నుంచి శాంపిల్స్ తీసుకుంటున్నట్టు చెప్పారు. అయితే, అధికారికంగా ఇప్పటి వరకు 89 మంది ఈ మిస్టరీ డిసీజ్‌తో మరణించినట్టు తెలిసిందని వివరించారు. డబ్ల్యూహెచ్‌వోకు చెందిన సైంటిస్టులు ఫాంగాక్ నగరానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఆ రీజియన్‌లో భారీగా వరదలు రావడమే అందుకు కారణమని పేర్కొన్నారు. ఆ బృందం ఇప్పుడు దేశ రాజధాని జూబా పట్టణానికి తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నదని తెలిపారు.

సూడాన్‌లో భారీ వరదలు వచ్చాయి. గత 60 ఏళ్లలో సూడాన్‌లో ఇవే భారీ వరదలు అని ఐరాస పేర్కొంది. కాగా, ఈ వింత వ్యాధిపై దక్షిణ సూడాన్ ల్యాండ్ మినిస్టర్ లామ్ తుంగ్వార్ కుయిగ్వాంగ్ మాట్లాడారు. వరదలతోనూ ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని వివరించారు. మలేరియా వ్యాధి విజృంభించడానికి ఈ వరదలు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాయని, పౌష్టికాహార లోపాన్ని (ఆహారం కొరత కారణంగా) పెంచుతున్నాయని చెప్పారు. ఈ రీజియన్‌లోని క్షేత్రాల నుంచి ఆయిల్ కూడా వరదల్లో కలిసిందని, అది తాగు నీటిని కలుషితం చేసిందని పేర్కొన్నారు. ఈ కలుషిత నీటి వల్ల సాదుకునే జంతువులూ మృత్యువాత పడ్డాయని అన్నారు.

Also Read: బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు.. వెల్లడించిన డీహెచ్ శ్రీనివాస్ రావు

యూఎన్ ప్రకారం, ఈ వరదల కారణంగా దక్షిణ సూడాన్‌లో 8.35 లక్షల మంది ప్రభావితులయ్యారు. 35 వేల మంది నిర్వాసితులయ్యారు. 1960 తర్వాత వచ్చిన భారీ వరదలు ఇవే అని.. తీవ్రంగా ధ్వంసమైన కొన్ని ప్రాంతాలను పేర్కొంటూ ఐరాసలోని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు.

తాజాగా తెలంగాణలో కూడా తొలిసారిగా ఒమిక్రాన్ బయటపడింది. తెలంగాణలో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు (Omicron cases In Telangana) నమోదయ్యాయి. తెలంగాణలో రెండు కేసులతో కలిపి భారత్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 59కి చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios