ఉక్రెయిన్ గగనతలాన్ని రష్యా క్షిపణులు, యుద్ధ విమానాల నుంచి రక్షించాలని నాటో కూటమిని అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ కోరారు. ఈ విజ్ఞప్తిపై 30 సభ్యదేశాలు గల నాటో కూటమి సమావేశమైంది. ఈ సదస్సులో ఉక్రెయిన్ గగనతలాన్ని తాము రక్షించలేమని ప్రకటించింది. దీంతో జెలెన్‌స్కీ నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ (Ukraine)పై రష్యా(Russia) యుద్ధం చేయడానికి నాటో(NATO Alliance) ప్రధాన కారణంగా ఉన్నది. ఉక్రెయిన్‌ను నాటో సైనిక కూటమిలో చేర్చుకోవద్దని రష్యా వారిస్తున్నది. ఉక్రెయిన్‌ను వారించినా వినలేదు. ఆ దేశాన్ని చేర్చుకోవద్దని నాటో కూటమి దేశాలను డిమాండ్ చేసినా వినలేవు. ఈ పరిణామాల తర్వాత రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగింది. ఈ క్రమంలోనే నాటో గురించి విస్తృత చర్చ జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని నాటో కేంద్రంగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ.. నాటో కూటమిని విమర్శించడం షాక్‌కు గురి చేసింది.
రష్యా దాడి చేస్తున్న సందర్భంలో ఉక్రెయిన్ దేశం నాటోకు ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ (No Fly Zone)గా ప్రకటించాలని కోరింది. దీనిపై నాటో కూటమి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం తాము ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటించలేమని స్పష్టం చేసింది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ నాటో కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు నాటో సదస్సు జరిగింది. అది చాలా బలహీనమైన సదస్సు. కన్ఫ్యూజ్‌డ్ సదస్సు అని మండిపడ్డారు. యూరప్ ఫ్రీడమ్ నెంబర్ వన్ గోల్ ఉండాలనే వాదనతో చాలా మంది యూరప్ నేతలు భావించడం లేదని తేలిపోయిందని వివరించారు. ఈ రోజు నాటో కూటమి నాయకత్వం ఉక్రెయిన్ గగనతలాన్ని నాన్ ఫ్లై జోన్‌గా ప్రకటించలేదని తద్వారా ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై రష్యా మరింత అధికంగా బాంబులు వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయిందని పేర్కొన్నారు. ఇకపై మరణించే ఉక్రెయిన్ పౌరులకు నాటో కూటమి కూడా బాధ్యత వహించాలని అన్నారు. ఈ రోజు నుంచి మరణిస్తున్నవారు కేవలం మీ వల్లే మరణించినట్టు అవుతుందని, మీ బలహీనతల వల్ల, మీలో ఐకమత్యం లేకపోవడం వల్ల మరణించినట్టేనని కటువుగా మాట్లాడారు.
30 దేశాల సభ్యులున్న నాటో కూటమి సదస్సు జరిగింది. ఈ సదస్సు తర్వాత నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ మాట్లాడారు. ఉక్రెయిన్ గగనతలాన్ని రక్షించడానికి రష్యా ప్రయోగించే క్షిపణులు, యుద్ధ విమానాలను నాటో దళాలు కూల్చాల్సి వస్తుందని, తద్వార ఉక్రెయిన్‌పై రష్యా దాడులు పూర్తిస్థాయి యుద్ధంగా పరిణమించే ముప్పు ఉంటుందని వివరించారు. నాటో రష్యా యుద్ధ విమానాలు, క్షిపణులను కూల్చేయడం ద్వారా ఇతర యూరప్ దేశాలూ అందులో పాలుపంచుకోవాల్సి వస్తుందని తెలిపారు. కానీ, తాము ఈ సంఘర్షణలో భాగంగా లేమని పేర్కొన్నారు. ఈ యుద్ధం ఉక్రెయిన్ దాటి ఇతర దేశాలకు వ్యాపించకుండా చూడాల్సిన బాధ్యత తమ మీద ఉన్నదని వివరించారు. అలా వ్యాపిస్తే అది మరింత ఉత్పాతానికి దారి తీస్తుందని తెలిపారు.
