ఈ ఏడాది చివరికల్లా మయన్మార్‌లో ఎన్నికలు జరిగేలా చూస్తామని మయన్మార్ సైన్యం ప్రకటించింది. దీంతో ఏడాది పాటు దేశంలో అత్యవసర పరిస్ధితిని విధిస్తున్నట్లు ప్రకటిచింది.

కాగా, మయన్మార్‌లో మరోసారి సైన్యం తిరుగుబాటు చేసింది. ఏడాది పాటు పాలనను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సోమవారం తెల్లవారు జామున మిలటరీ నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) నాయకురాలు, స్టేట్‌ కౌన్సిలర్‌ ఆంగ్‌ సాన్‌‌ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది.

ఆ దేశ పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి కొద్ది గంటల ముందు సైన్యం తిరుగుబాటు చేయడం గమనార్హం. మయన్మార్‌ రాజధానిలో ముందు జాగ్రత్త చర్యగా సైన్యం మొబైల్‌ సేవలను, ఇంటర్‌నెట్‌ను నిలిపివేసింది.

Also Read:మాయన్మార్ లో సంక్షోభం.. సైనికుల అదుపులో ఆంగ్ సాన్ సూకీ

గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ భారీ ఆధిక్యంతో విజయం సాధించిన సంగతి తెలిసిందే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ సైన్యం ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేసింది.

అక్రమాలపై ఎలాంటి ఆధారాలు లేవంటూ ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే సైన్యం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే తాజా పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేశాయి.