Moscow: రష్యాలో సైనిక తిరుగుబాటుతో ఆ దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్ర‌మంలోనే రష్యాకు చెందిన ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సర్వీస్ వాగ్నర్ గ్రూప్ చీఫ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసిన రష్యా..  అతని ఆదేశాలను పట్టించుకోకుండా అరెస్టు చేయాలని ప్రయివేటు మిలిటరీ కంపెనీ దళాలకు పిలుపునిచ్చింది. 

Wagner Group-civil war in russia: ఇప్ప‌టికే అంత‌ర్జాతీయంగా తీవ్ర ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైన ర‌ష్యా-ఉక్రెయిన్ య‌ద్ధం మ‌ధ్య మ‌రో క‌ల‌క‌లం మొద‌లైంది. ర‌ష్యాలో తిరుగుబాటు మొద‌లైంది. అక్క‌డి ప్ర‌యివేటు సెక్యూరిటీ స‌ర్వీస్ వాగ్న‌ర్ గ్రూప్ చీఫ్ ఈ సైనిక తిరుగుబాటును ప్ర‌క‌టించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పై ప‌గ తీర్చుకుంటామంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. రష్యాలో సైనిక తిరుగుబాటుతో ఆ దేశంలో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్ర‌మంలోనే రష్యాకు చెందిన ఎఫ్ఎస్బీ సెక్యూరిటీ సర్వీస్ వాగ్నర్ గ్రూప్ చీఫ్ పై క్రిమినల్ కేసు నమోదు చేసిన రష్యా.. అతని ఆదేశాలను పట్టించుకోకుండా అరెస్టు చేయాలని ప్రయివేటు మిలిటరీ కంపెనీ దళాలకు పిలుపునిచ్చింది.

వివ‌రాల్లోకెళ్తే.. శక్తివంతమైన కిరాయి దళం వాగ్నర్ అధిపతి యెవ్ జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పాల్పడ్డారని ఆరోపించిన రష్యా ఆయనను అరెస్టు చేయాలని ఆదేశించింది. ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించి రష్యా కిరాయి సైన్యాధిపతి యెవ్ జెనీ ప్రిగోజిన్ కు, సైనిక ఉన్నతాధికారులకు మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇప్పుడు తెరపైకి వచ్చింది. వాగ్నర్ బృందం సాయుధ తిరుగుబాటుకు పాల్పడిందని క్రెమ్లిన్ ఆరోపించిన తరువాత, వాగ్నర్ ఫైటర్లు ఉక్రెయిన్ నుండి సరిహద్దు దాటి రష్యాలోకి ప్రవేశించారని, మాస్కో సైన్యానికి వ్యతిరేకంగా అన్ని విధాలా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని రాయిటర్స్ నివేదించింది. యెవ్ జెనీ ప్రిగోజిన్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తన సైనికుల‌ను లక్ష్యంగా చేసుకుంటూ, రష్యా సైన్యం దాడులకు తెగబడుతోందని, ఈ దాడుల్లో వందలాది మంది త‌మ సిబ్బంది చినిపోయార‌ని ఆరోపిస్తూ.. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామ‌న్నారు. పుతిన్ పై ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని హెచ్చరిస్తూ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చాడు. 

వాగ్నర్ గ్రూప్ అనేది ఉక్రెయిన్ లో సాధారణ రష్యన్ సైన్యంతో కలిసి పోరాడుతున్న కిరాయి సైనికుల ప్ర‌యివేటు సైన్యం. ఒకప్పుడు పుతిన్ కు ప్రిగోజిన్ మిత్రుడు. అయితే, ఇటీవలి కాలంలో మాస్కోతో తీవ్ర వైరం పెంచుకున్నారు. సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చిన యెవ్ జెనీ ప్రిగోజిన్.. త‌న వాగ్న‌ర్ బ‌ల‌గాల‌తో ముందుకు సాగుతున్నారు. రోస్టోవ్ లోని సదరన్ మిలిటరీ డిస్ట్రిక్ట్ భవనాన్ని వాగ్నర్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయనీ, దీంతో మాస్కో అంతటా భద్రతను కట్టుదిట్టం చేశామని ప్రభుత్వ మీడియా తెలిపింది. "మాస్కోలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. మాస్కోలోని ప్రభుత్వ భవనాలు, రవాణా సౌకర్యాలు, ఇతర కీలక ప్రదేశాలలో భద్రతను కట్టుదిట్టం చేశామ‌ని" సంబంధిత ర‌ష్యన్ అధికారులు తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, ఎఫ్ఎస్బి విభాగం, రోస్టోవ్ పరిపాలన-పోలీసు విభాగాలలో ఒకదాని భవనాలను కూడా వాగ్న‌ర్ బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నారని స్థానిక ఛానెల్స్ నెక్స్టా తెలిపింది. తమ బలగాలు దక్షిణ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించాయని వాగ్నర్ గ్రూప్ చీఫ్ చెప్పడంతో రోస్టోవ్ లోని రష్యా అధికారులు నివాసితులను ఇళ్లలోనే ఉండాలని కోరారు.

"ప్రస్తుత పరిస్థితి కారణంగా, దయచేసి నగర కేంద్రానికి ప్రయాణించడం మానుకోండి. వీలైతే, మీ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా ఉండండి" అని రోస్టోవ్ రీజియన్ గవర్నర్ ఒక సలహాలో పేర్కొన్నారు. రష్యా సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు సర్వశక్తులు ఒడ్డతానని రష్యాకు చెందిన వాగ్నర్ కిరాయి దళం ప్రతిజ్ఞ చేసింది. తమ బలగాలు తమ దారిలో ఉన్న ప్రతిదాన్ని నాశనం చేస్తాయని ఆయన అన్నారు. దేశ సైనిక నాయకత్వాన్ని కూలదోస్తామని కిరాయి దళం చీఫ్ వాగ్నర్ ప్రతిజ్ఞ చేసిన తరువాత రష్యా రాజధానిలో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నట్లు మాస్కో మేయర్ శనివారం చెప్పారు. మాస్కోలో వస్తున్న సమాచారంతో భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నట్లు సెర్గీ సోబ్యానిన్ సోషల్ మీడియాలో తెలిపారు. మాస్కోకు దక్షిణాన ఉన్న లిపెట్స్క్ ప్రాంత గవర్నర్ ఇగోర్ అర్టమోనోవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భద్రతా చర్యలను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతున్న‌ట్టు పేర్కొన్నారు. 

పౌర కాన్వాయ్ పై కాల్పులు జరిపిన రష్యా సైనిక హెలికాప్టర్ ను తమ బలగాలు కూల్చివేశాయని ప్రిగోజిన్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాంతం, దాడికి సంబంధించి పూర్తి వివ‌రాలు అంద‌లేద‌నీ, ఈ వాదనను వెంటనే ధృవీకరించలేమని బీబీసీ నివేదించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 24 గంటలూ అప్ డేట్స్ పొందుతున్నారనీ, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, మిత్రదేశాలతో సంప్రదింపులు జరుపుతున్న‌ట్టు రాయిట‌ర్స్ నివేదించింది.