ప్రపంచ దేశాలను కరోనా వైరస్ విపరీతంగా కలవర పెడుతోంది. ఊహకందని రీతిలో కరోనా కేసులు.. దాని తాలుకూ మరణాలు పెరిగిపోతున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు 2లక్షలకు చేరువ కానుంది. కాగా..  ఇప్పటి వరకు 1.70లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 

కాగా.. ఇప్పటి వరకు 24.7లక్షల మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా.. ఈ వైరస్ గతేడాది డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో మొదలవ్వగా.. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు పాకేసింది.

ఇదిలా ఉండగా.. ఈ మరణాలలో ఎక్కువ శాతం అమెరికా, ఫ్రాన్స్ లలోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఫ్రాన్స్‌లో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 20 వేలు దాటింది. ఫ్రాన్స్‌లో సోమవారం కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌తో 547 మంది మరణించారు. దీనితో  దేశవ్యాప్తంగా వైరస్ కారణంగా 20,000 మందికి పైగా మరణించినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. 

దేశంలో ఇప్పటివరకు కోవిడ్ -19 బారిన పడి  20,265 మంది మరణించారని టాప్ హెల్త్ ఆఫీసర్ జెరోమ్ సలోమన్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన అమెరికా, ఇటలీ స్పెయిన్ ల తరువాత ఫ్రాన్స్ నాల్గవ దేశంగా నిలిచింది.  ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం అమెరికాలో ఎక్కువగా కనిపించింది. ఇక్కడ కోవిడ్ -19 మరణాల సంఖ్య 40,683 కు పెరిగింది. కాగా.. వైరస్ సోకిన వారి సంఖ్య 8లక్షలకు చేరింది.