అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ నిండు గర్భిణీ పొట్టకోసి.. ఆమె కడుపులోని బిడ్డను దొంగలించింది. అంతకముందే నేరం చేసి జైలుకి వెళ్లిన ఆమె.. బెయిల్ పై బయటకు వచ్చి మరో దారుణానికి పాల్పడింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. టేలర్‌ పార్కర్‌(27) అనే మహిళ గత బుధవారం వరకు టెక్సాస్‌ జైలులో ఉంది. అయితే గత గురువారం నాడు 5 మిలయన్‌ డాలర్ల పూచికత్తుతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేశారు. జైలు నుంచి బయటకు వచ్చిందే తడవుగా ఆమె మరో ఘాతుకానికి పాల్పడింది. ఒక గర్భిణిని చంపి ఆమె బిడ్డను తనకు పుట్టిన శిశువుగా తీసుకొని ఆసుపత్రికి తీసుకొని వచ్చింది.

తనకు ఆస్పత్రికి వస్తుండగా.. మార్గమధ్యలో కాన్పు అయ్యిందని.. వైద్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. శిశువు శ్వాస తీసుకోవడం లేదని చికిత్స చేయాలని కోరింది. బిడ్డను పరిశీలించిన  డాక్టర్లు ఆమె మరణించినట్లు ప్రకటించారు. అనంతరం అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్కర్‌ను నిలదీయగా అసలు విషయం బయట పెట్టింది. చనిపోయిన మహిళ మృతదేహాన్ని పార్కర్‌ ఉన్న ప్రాంతానికి 15 కిలో మీటర్ల దూరంలో గుర్తించారు.  హత్య, అపహరణ ఆరోపణలపై పార్కర్‌ను పోలీసలు మరోసారి అరెస్ట్‌ చేశారు.