తల్లిపాల ప్రాముఖ్యత గురించి అందరికీ తెలుసు. అయినప్పటికీ.. ఇప్పటికీ చాలా మంది తల్లులు బహిరంగంగా బిడ్డకు పాలు ఇవ్వడానికి సంకోచిస్తుంటారు. మరి కొందరు.. వారి అందచందాలకు ఆటంకం కలుగుతుందని బిడ్డలకు డబ్బాపాలు పడుతుంటారు. ముఖ్యంగా మోడలింగ్, సినీ రంగానికి చెందిన చాలా మంది వారి బిడ్డలకు తల్లిపాలు దూరం చేస్తున్నారు.

అయితే.. ఓ మోడల్ మాత్రం.. తన బిడ్డకు పాలు ఇస్తూ ఏకంగా ర్యాంప్ వాక్ చేసింది. స్పోర్ట్స్  ఇల్లస్ట్రేటెడ్  స్విమ్ సూట్   మోడల్ మారా మార్టిన్ ఈ మేరకు చేసిన పని ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

అమెరికాలోని మియామీలో నిర్వహించిన స్విమ్ సూట్ ఫ్యాషన్ షోలో మార్టిన్ గోల్డ్ కలర్ బికినీ ధరించి తన ఐదు నెలల పాపకు పాలిస్తూ ర్యాంప్ మీద క్యాట్ వాక్ చేసింది. ఈ వీడియో - ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘మోడల్ మామ్’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె ఫోటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

నిజానికి మార్టిన్ ఒక్కతే ఆ షోలో ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంది. అయితే.. స్పాంటేనియస్ గా తాను ఆ నిర్ణయం తీసుకున్నానని.. ఆ షో ద్వారా తల్లిపాల ప్రాముఖ్యతను కూడా వివరించాలని తాను అనుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన పనిని కొందరు విమర్శిస్తున్నా.. చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.