‘చంకలో పిల్లను పెట్టుకొని ఓ మహిళ ఊరంతా వెతికిందంట’.. ఈ సామెత ఎప్పుడైనా విన్నారా..? తమ కూతురి విషయంలో ఓ తల్లిదండ్రులకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇంట్లో కనిపించకుండా పోయిన కూతురి కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ దొరకకపోగా.. చివరకు ఆమె ఇంట్లోనే దాక్కుందని తెలిసి షాకయ్యారు. ఈ సంఘటన దుబాయిలో చోటుచేసుకోగా..  సదరు యువతి కుటుంబం భారత సంతతికి  చెందిన వారు కావడం గమనార్హం. 

ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే... భారత్ కి చెందిన ఓ కుటుంబం దుబాయిలో స్థిరపడింది. వారికి 16ఏళ్ల కుమార్తె హరిణి ఉంది. కాగా.. గురువారం ఉదయం 6.30 గంటలకు మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లింది. ప్రతిరోజు ఇలా వాకింగ్ వెళ్లి మళ్లీ 7 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసేది. కానీ, గురువారం హరిణి తిరిగి ఇంటికి రాలేదు. చాలా సేపటి వరకు తల్లిదండ్రులు ఆమె కోసం వేచి చూసిన ఎంతకు రాకపోవడంతో చుట్టుపక్కల అంతా వెతికారు. 

తెలిసిన వారిని కూడా వాకాబు చేశారు. కానీ, ఆమె ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో కంగారుపడిన ఆమె పెరేంట్స్ ఉయదం 9 గంటల ప్రాంతంలో 999కు కాల్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. వాకింగ్‌కు వెళ్లిన కూతురు తిరిగి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశారు. 

వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులకు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో హరిణి ఆచూకీ దొరికింది. దాంతో వెంటనే ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే, ఆ రోజంతా ఆమె ఎక్కడికి వెళ్లింది? ఏం చేసింది? ఎవరైనా తీసుకెళ్లారా? లేక ఆమెనే తనంతట తానుగా ఎక్కడికైనా వెళ్లిందా? అనే విషయాలను పోలీసులు ఆమె తల్లిద్రండులకు చెప్పలేదు. 

తాజాగా ఈ కేసులోని అసలు ట్విస్టును పోలీసులు రీవిల్ చేశారు. అదేంటంటే.. హరిణి బయటకెక్కడికి వెళ్లలేదు. వారి ఇంటి రూఫ్‌పైనే దాక్కుంది. తల్లిదండ్రులు తన మొబైల్ లాక్కొవడంతో అలిగిన ఆమె గురువారం ఉదయం 6.30 గంటలకు వాకింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పి.. ఇంటి రూఫ్‌పైకి వెళ్లి దాక్కుంది. ఆ రోజంతా అక్కడే ఉంది. ఇక చీకటి కావడంతో కిందకు దిగిన ఆమె.. ఇంట్లోకి వెళ్లకుండా పెరేంట్స్ తిడతారేమోనన్న భయంతో బయటకు వెళ్లిపోయింది. 

ఇక రోజూ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి హరిణి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి ఫిర్యాదుతో హరిణి ఆచూకీ కోసం వెతుకుతున్న పోలీసులకు రాత్రి 11 గంటల ప్రాంతంలో వారి ఇంటి సమీపంలోనే ఆమె కనిపించింది. దీంతో ఆమెను తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం పోలీసుల విచారణలో ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది.