రష్యా, ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాము జనసమ్మర్ధంగా ఉండే ప్రాంతాలపై దాడులు జరుపబోమని ఆయన వివరించారు. కానీ, ఉక్రెయిన్‌లోని ఓ విమానాశ్రయంలో క్షిపణి దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది.

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌(Ukraine)పై రష్యా(Russia) అధ్యక్షుడు Vladimir Putin ఈ రోజు యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సైనికీకరణ, నాజీకరణను నియంత్రించడానికి దాడులు చేయక తప్పడం లేదని రష్యా ప్రకటించింది. అదే సమయంలో తాము జనసమ్మర్థమైన నగరాలపై దాడి చేయబోమని వెల్లడించింది. కానీ, మీడియా సంస్థ పోస్టు చేసిన వీడియో ప్రకారం.. రష్యా ఓ ఎయిర్‌పోర్టుపై క్షిపణి దాడి జరిపింది. ఆ వీడియోలో ఆకాశంలో నుంచి క్షిపణి వేగంగా దూసుకెళ్లి ఎయిర్‌పోర్టులో పేలింది. పెద్ద మొత్తంలో నిప్పు ఎగజిమ్మింది. దట్టమైన పొగలు వచ్చాయి. ఆ పేలుడు శబ్దం వినగానే చాలా మంది పరుగులు పెట్టారు. ఆ 30 సెకండ్ల వీడియో(Video)లో క్షిపణి దాడి (Missile Attac) స్పష్టంగా రికార్డ్ అయింది. ఉక్రెయిన్‌లోని ఇవానో ప్రాంకివ్‌స్క్‌లోని ఓ విమానాశ్రయంలో ఈ పేలుడు జరిగింది.

ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి సలహాదారు ఆంటోన్ గెరాష్చెంకో మాట్లాడుతూ, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ మిలిటరీ కమాండ్ వ్యవస్థలు, ఎయిర్‌బేస్‌లు, మిలిటరీ డిపోలపై దాడులు జరిపిందని వివరించారు. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కివ్, నిప్రో నగరాలపై దాడులు చేసిందని తెలిపారు. కాగా, మిలిటరీ మాత్రం తాము జనం రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాలపై దాడులు చేయడం లేదని వివరించింది.

Scroll to load tweet…

కీవ్‌లో పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానిక జర్నలిస్టు ఒకరు వెల్లడించారు. గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ పేలుడు శబ్దం వినిపించిందని తెలిపారు. కీవ్‌లో తొలిసారిగా ఈ శబ్దం వినిపించగానే ప్రజలు ఒక్కసారి భయకంపితులు అయ్యారని చెప్పారు. అందరూ వీధిలోకి వచ్చి అరుపులు.. కేకలు పెట్టారని పేర్కొన్నారు. అనంతరం మళ్లీ సాధారణ వాతావరణం నెలకొన్నట్టు వివరించారు. కాగా, కీవ్ నుంచి చాలా మంది బయటకు వెళ్తున్న దృశ్యాలు నగరంలో కనిపించాయి. దీంతో రోడ్లు రద్దీగా మారిపోయాయి. కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఈ రోజు ఉదయమే ఉక్రెయిన్‌లోని కొన్ని కీలక ప్రాంతాల్లో బాంబులు, క్షిపణుల ద్వారా దాడులు జరిగాయి. ఉక్రెయిన్‌లోని వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్టు రష్యా ప్రకటించింది. కానీ, ఉక్రెయిన్ ప్రభుత్వం.. రష్యా ప్రకటనను కొట్టిపారేసింది. తమ ఎయిర్ డిఫెన్స్ సేఫ్‌గా ఉన్నదని, వాటిని ధ్వంసం చేశామని రష్యా అబద్ధాలు చెబుతున్నదని వివరించింది. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్ మరో ప్రకటనలో తామే 50 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని తెలిపింది. అంతేకాదు, మరో రష్యా విమానాన్ని కూడా ధ్వంసం చేశామని వివరించింది. శ్చాస్త్య రీజియన్‌ను ఉక్రెయిన్ తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు పేర్కొంది. క్రమాటోర్స్క్ రీజియన్‌లో ఇప్పటికే తాము ఐదు రష్యా విమానాలను ధ్వంసం చేసినట్టు తెలిపింది. తాజా దాడిలో ఆరో విమానాన్నికూడా నాశనం చేశామని వివరించింది. కాగా, రష్యా జరిపిన షెల్లింగ్ దాడుల్లో ఏడుగురు తమ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని పేర్కంది. కాగా, మరో తొమ్మిది మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పింది.