దక్షిణ సూడాన్‌: ప్రపంచమంతా స్త్రీని గౌరవించాలి, పూజించాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. స్త్రీల సాధికారత కోసం ప్రపంచంలోని అనేక దేశాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినా అమ్మాయిలపై దారుణాలు మాత్రం ఆగడం లేదు. 

పదహారేళ్ల మైనర్‌ బాలికను ఫేస్‌బుక్‌లో వీడియో ద్వారా వేలం వేసి, వేలంలో పాడుకున్న వ్యక్తితో పెళ్లి చేసిన అమానుష ఘటన దక్షిణ సూడాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దక్షిణ సూడాన్ లోని ఓ వ్యక్తి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడానికి డబ్బు చెల్లించమని చెబుతున్న వీడియో ఫేస్ బుక్ లో అక్టోబర్ 25 నుంచి వైరల్ అవుతుంది. 

అయితే ఈ వైరల్ వీడియోను ఆలస్యంగా గమ నించిన ఫేస్ బుక్ యాజమాన్యం నవంబర్ 9న ఆ యూజర్ ఐడీని బ్లాక్ చేసి వీడియోను తొలగించింది. అయితే అప్పటికే ఆ మైనర్ బాలికకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

 ఫేస్ బుక్ లో అమానవీయతను, అక్రమాన్ని ప్రదర్శించే చర్యలను అనుమతించేది లేదని ఫేస్ బుక్ ప్రతినిధి తెలిపారు. తమ కంపెనీ పాలసీలను ధిక్కరించే పోస్ట్‌లను గుర్తించడానికి 30 వేల మంది ఉద్యోగులను నియమించినట్లు తెలిపారు. మైనర్‌ బాలిక వేలానికి పాల్పడిన వ్యక్తి యూజర్‌ ఐడీని బ్లాక్‌ చేసినట్లు స్పష్టం చేశారు. 

అయితే ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న వీడియోపై మానవ హక్కుల కార్యకర్తలు ఆరా తియ్యగా వేలంపాటలో ఆ మైనర్ బాలికను ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలిసింది. నవంబర్ 3న అతను బాలికను పెళ్లి చేసుకున్నాడు.  

యూనిసెఫ్‌ 2017 గణాంకాల ప్రకారం దక్షిణ సూడాన్‌లో 52 శాతం మందికి పద్దెనిమిదేళ్లు నిండకుండానే పెళ్లిళ్లు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్త స్పష్టం చేశారు. సూడాన్‌లో బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు సహజంగానే ఎక్కువ అన్నారు. వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తుండగా టెక్నాలజీ సహాయంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైందని మానవ హక్కుల కార్యకర్త ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.