భారతీయ వంటకాలను ఇష్టపడేవారు ప్రపంచవ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ఆ ఆహారం పట్ల ఉన్న ప్రేమ కారణంగానే  చాలా మందిని ఏకం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు.. సాధారణ ప్రజలు కూడా.. తమకు భారతీయ వంటకాలపై ఉన్న అభిమానాన్ని పలు సందర్భాల్లో తెలియజేశారు. విదేశాల నుంచి వచ్చి ఇక్కడి ఆహారాన్ని రుచి చూసేవారు కూడా చాలా మందే ఉన్నారు.

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా భారతీయ వంటకాలను చాలా ఎక్కువగా ఇష్టపడతారు. గతంలో ఆమె పలు దక్షిణాది వంటను స్వయంగా చేశారు. అమెరికా ఎన్నికలకు ముందు ఆమె దీనికి సంబంధించిన వీడియోని కూడా అందరితో పంచుకున్నారు. తాను దోశె వేయడం నేర్చుకుంటున్నానని ఆమె అందులో చెప్పారు. కాగా.. తాజాగా.. కమలా హ్యారిస్  మేనకోడలు, న్యాయవాది మీనా హ్యారిస్.. భారతీయ వంటకాలపై తనకు ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

 

తాను పెరగన్నం, నిమ్మకాయ పచ్చడి.. క్యాలిప్లవర్ రైస్ తయారు చేశానని చెబుతూనే తనకు దక్షిణాది వంటపై ఉన్న అభిమానాన్ని ఆమె పంచుకున్నారు.  మామూలు పెరుగు అన్నాన్ని ఆమె కాస్త భిన్నంగా చేయడం గమనార్హం.  కాగా.. ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా.. తాను చేసిన ఈ వింత వంటకం చూసి.. దక్షిణ భారతీయులకు కోపం వస్తుందేమో అని ఆమె సరదాగా పేర్కొన్నారు. 

కాగా.. ఆ ట్వీట్ ని ఇప్పటి వరకు వందల సంఖ్యలో రీట్వీట్ చేశారు. 3.5 వేల లైకులు కూడా వచ్చాయి. ఇక కామెంట్స్ కూడా వేలల్లో వచ్చిపడటం గమనార్హం. కొందరు రుచి చూడాలని ఉందంటూ కామెంట్స్ చేయడం విశేషం.