యుద్ధోన్మాది రష్యాను ఆర్థికంగా అరికట్టడానికి ప్రపంచదేశాలు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ వాణిజ్య కంపెనీల మీద సోషల్ మీడియాలో ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కోకా-కోలా, పెప్సికో లు తమ వ్యాపారాలను నిలిపివేయగా, తాజాగా మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్, జనరల్ ఎలక్ట్రిక్ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
కోకాకోలా, పెప్పికో బాటలోనే మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్, జనరల్ ఎలక్ట్రిక్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దాడికి నిరసనగా రష్యాలో తమ వ్యాపార కలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. రష్యా మీద ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలకు ప్రతిచర్యగానే ఇది జరిగింది. కాగా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభం నాటి నుంచి ప్రముఖ వాణిజ్య సమస్యలైన మెక్ డొనాల్స్, coca cola, పెప్సికో, ఇతర ప్రధాన పాశ్చాత్య ఆహార పానీయాల కంపెనీలను రష్యా నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయా బ్రాండ్లను బహిష్కరించాలని నెట్టింట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
Netflix, Levi's, Burberry, Ikea వంటి అనేక ఇతర కంపెనీలు రష్యానుండి వైదొలగాలని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి అనుగుణంగానే గత వారం రోజుల నుంచి 'BoycottMcDonalds', 'BoycottCocaCola' అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి. starbucks, KFC, burger king లతో సహా అనేక విదేశీ ఆహార, పానీయాల ఫ్రాంఛైజీలమీద కూడా ఈ ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో ప్రముఖ అమెరికన్ నటుడు, చిత్ర నిర్మాత సీన్ పెన్.. Coca-Cola, PepsiCo, McDonald's లు రష్యాలో వ్యాపారం నిలిపివేసేంత వరకు అమెరికన్లు ఈ కంపెనీల ఉత్పత్తుల వినియోగాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో ఈ ప్రచారం పెద్ద ఎత్తున ఊపందుకుంది. అలాగే.. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డ్రాగన్స్ డెన్ పెట్టబడిదారు డెబోరా మీడెన్ కూడా కోకాకోలాను బహిష్కరించాలని ప్రజలకు సూచించారు.
అలాగే.. ప్రముఖ ప్రొఫెసర్ నికోలస్ క్రిస్టాకిస్ కూడా మెక్‌డొనాల్డ్స్, శీతల పానీయాల కంపెనీలు రష్యాలో తమ వ్యాపారాలను కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ దేశానికి నైతిక మద్ధతుగా పాశ్యాత్య కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపేయాలని ఉక్రెయిన్
విదేశాంగ మంత్రి కూడా పిలుపునిచ్చారు. మానవతా ప్రాతిపదికన రష్యా నుండి తమ సేవలు ఉపసంహరించుకోవాలని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అన్ని పాశ్చాత్య కంపెనీలను కోరారు. "కోకాకోలా, మెక్ డొనాల్డ్స్ లు రష్యాలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, వాటి ఉత్పత్తులు ఇంకా విక్రయిస్తున్నాయని తెలిసి నిరాశ పడ్డాం’.. అన్నారు.
ఇలా ప్రపంచ వ్యాప్తంగా.. కోకా-కోలా , పెప్సికో లపై ఒత్తిడి రావడంతో రష్యాలో వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు శీతల పానీయాలరంగంలో దిగ్గజాలైన కోకాకోలా, పెప్సికో ఇంతకుముందే ప్రకటించింది. ఇప్పుడు తాజాగా మెక్ డొనాల్డ్స్, స్టార్ బక్స్, జనరల్ ఎలక్ట్రిక్ కూడా ఇదే బాటలో తమ నిర్షయాన్ని ప్రకటించాయి. మెక్‌డొనాల్డ్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, కంపెనీ గత సంవత్సరం చివరి నాటికి రష్యాలో 847 రెస్టారెంట్‌లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం నేరుగా కంపెనీనే నిర్వహిస్తుంది. అదనంగా, ఉక్రెయిన్‌లో 108 రెస్టారెంట్లు ఉన్నాయని కూడా పేర్కోంది. ఉక్రెయిన్ మీద రష్యా దాడిని నిరసిస్తూ... ఆపిల్, వీసాలాంటి ప్రముఖ కంపెనీల రష్యాలో కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి.
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్దం13 వ రోజుకు చేరుకుంది. యుద్దం ప్రారంభించిన నాటి నుంచి రష్యన్ బలగాలు.. ఉక్రెయిన్ నగరాలపై విరుచుకుపడుతున్నాయి. యుద్దాన్ని నిలిపివేయాలని ప్రపంచ దేశాలు రష్యాను కోరినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా.. రష్యా రోజురోజుకు యుద్ద తీవ్రతను పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.
