కొద్దిరోజుల క్రితం భీకర పేలుళ్లతో ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన లెబనాన్ రాజధాని బీరుట్‌లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో అగ్నికీలలు ఎగిసిపడిన దట్టమైన పొగలు ఆకాశంలో కమ్ముకున్నాయి.

ఇంజిన్ ఆయిల్, వాహనాల టైర్లను నిల్వ చేసే గోదాంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కాగా ఈ ప్రమాదానికి కారణాలు.. ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి వుంది. మరోవైపు ఆగస్టు 4న అమ్మోనియం నైట్రేట్ నిల్వ చేసే గోదాంలో భారీ పేలుళ్లు సంభవించిన ఘటనలో 190 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా 6,500 మంది తీవ్రగాయాల పాలయ్యారు. నాటి పేలుడులో వేలాది భవనాలు నేలమట్టాయి. తాజా ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో బీరుట్ ప్రజలు మరోమారు భయంతో వణికిపోయారు.