పాకిస్తాన్‌లోని మిలిటరీ బేస్‌లోని ఆయుధాల డిపోలో భారీ మంటలు ఎగసిపడ్డాయి. ఆ తర్వాత వరుసగా పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. సియల్‌కోట్‌లోని ఆయుధాలు భద్రపరిచే ఏరియాలో ఈ పేలుళ్లు సంభవించాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని సియల్‌కోట్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. పాకిస్తాన్ ఆర్మీ నియంత్రణలోని కంటోన్‌మెంట్ ఏరియా సమీపంలో ఆ దేశ ఆర్మీకి చెందిన ఆయుధాలు భద్రపరిచే డిపో ఉన్నది. ఈ డిపోలో తొలుత మంటలు కనిపించాయి. ఆ తర్వాత భారీ శబ్దాలతో పెద్ద పెద్ద పేలుళ్లు చోటుచేసుకున్నాయి. పంజాబ్ ప్రావిన్స్‌లోని మిలిటరీ బేస్‌లో ఈ మంటలు చోటుచేసుకోవడం గమనార్హం.
ఉత్తర పాకిస్తాన్‌లోని సియల్‌కోట్ మిలిటరీ బేస్‌లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని డైలీ మిలాప్ ఎడిటర్ రిషి సురీ పేర్కొన్నారు. ప్రాథమిక సూచనల ప్రకారం, అది పేలుడు పదార్థాలు భద్రపరిచే స్థలం అని తెలిసిందన్నారు. భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయని తెలిపారు. అయితే, పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని వివరించారు.
ఇప్పటి వరకు ఈ ఘటనలో ప్రాణ హాని జరగలేదని స్థానికులు చెప్పారు. కాగా,ఈ ఘటనపై పాకిస్తాన్ మిలిటరీ స్పందించాల్సి ఉన్నది. ఈ పేలుళ్లు శబ్దం వినిపిస్తున్న ప్రాంతాలు, కనిపిస్తున్న ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా గంభీరంగా మారింది. వరుసగా ఒకే చోట బాంబులు పడుతున్నట్టుగా వీడియోలని దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాగా, అసలు ఆ మిలిటరీ బేస్‌లో ఏదో జరుగుతున్నదని కొందరు కొత్త అనుమానాలకు తెర తీస్తున్నారు.
