న్యూయార్క్‌: అంతర్జాతీయ ఉగ్రవాదిగా జైషే మహమ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ను ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. పుల్వామా దాడి సమయంలోనే మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సింది. అందుకు చైనా మెకాలడ్డుకోవడంతో అది కాస్త పెండింగ్ లో పడింది.

అజార్ ను ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ లో పెట్టకుండా చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. అయితే తాజాగా అజార్ విషయంలో చైనా పెట్టిన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. చైనా అడ్డుతప్పుకోవడంతో ఎట్టకేలకు మసూద్ అజార్ ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. 

అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు అంగీకరించాలని అభ్యంతరాలను విత్ డ్రా చేసుకోవాలంటూ డ్రాగన్‌పై అమెరికా, ఫ్రాన్స్‌, బ్రిటన్‌ చైనాపై  ఒత్తిడి పెంచడంతో ఎట్టకేలకు చైనా దిగిరాక తప్పలేదు. 

ఐక్యరాజ్యసమితి మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన తర్వాత పాక్ కూడా వెంటనే స్పందించింది. అజార్ కు గ్లోబల్ ఉగ్రవాది ట్యాగ్ ఇవ్వడం పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. 

ఇకపోతే అజార్ ను బ్లాక్ లిస్ట్ లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ ప్రకటించారు. మసూద్ అజార్‌ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా తేల్చింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది’ అని అక్బరుద్దీన్‌ ట్వీట్‌ చేశారు. 

అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో అతని ఆస్తులు ఇతరత్రా విదేశాల్లో ఉంటే జప్తు చేసేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చునని ప్రకటించారు. ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్ల వాహన శ్రేణిపై జరిగిన దాడిలో 41 మంది జవాన్లు అమరులయ్యారు. 

పుల్వామా దాడి తమపనేనని జైషే మహ్మద్ స్పష్టం చేసింది. పుల్వామా ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్ మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితిని డిమాండ్ చేసింది. 

ఈ విషయంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు అండగా ఉన్నప్పటికీ పక్కదేశం అయిన చైనా మాత్రం అంగీకరించలేదు. సాంకేతిక పరమైన విషయాలున్నాయంటూ అభ్యంతరం చెప్పింది. 

అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చైనాపై ఇతర దేశాలు ఒత్తిడిపెంచడంతో దిగొచ్చింది. అజాద్ పై చెప్పిన అభ్యంతరాలను ఉపసంహరించుకుంది. దాంతో ఐక్యరాజ్యసమితి అజాద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.