ఇదో విచిత్రమైన కేసు వింటే ఆశ్చర్యపోతారు. ముక్కుమీద వేలేసుకుని ఇదెక్కడి ఛోద్యం అంటారు. ఓ మనిషి కుక్కలా మారిపోయాడు దీనికోసం ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు పెట్టాడు.
జపాన్ : పూర్తిగా జంతువుల కనిపించాలన్న తన జీవిత కలను సాకారం చేసుకున్నాడు ఓ జపాన్ వాసి. అచ్చు ‘కోలీ’ జాతి శునకంలా మారిపోయాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పంచుకోగా వాటిని చూసిన నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు గురి అవుతున్నారు. పూర్తి శునకంలా కనిపించేందుకు ఓ వ్యక్తి భారీగా ఖర్చు చేయగా, నిపుణులు నలభై రోజులపాటు కష్టపడ్డారు.
జపాన్ కు చెందిన న్యూస్.మైనవి వార్తా ఏజెన్సీ ప్రకారం.. జెప్పెట్ అనే ఓ సంస్థ సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం పెద్దఎత్తున శిల్పాలను తయారు చేస్తోంది. అద్భుత కళాఖండాలను ఉత్పత్తి చేస్తుంది. ప్రసిద్ధ మస్కట్ పాత్రల దుస్తులను కూడా రూపొందిస్తోంది. కాగా టోకో ఇవీ అనే వ్యక్తి.. పూర్తిగా శునకంలా కనిపించాలనే కోరికను జెప్పెన్ ముందుంచాడు. ఎంత ఖర్చు అయినా భరిస్తాను అని చెప్పడంతో ఇందుకు ఆ సంస్థ అంగీకరించింది.
సంస్థ కళాకారులు 40 రోజుల పాటు కష్టపడి టోకో ఇవీని కోలీ జాతి శునకంలా మార్చారు. మేకప్, ఇతరత్రా ఖర్చులకోసం ఇవీకి 2 మిలియన్ యెన్ లు (దాదాపు రూ. 12 లక్షలు) ఖర్చయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో, వీడియో యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్నాడు టోకో ఇవీ. అయితే ఎన్ని రోజుల పాటు ఇలా ఉంటాను అనే విషయం మాత్రం అతను చెప్పలేదు.
ఈ స్టోరీ వింటే వెర్రి వెయ్యి విధాలు అనిపిస్తుందా? డబ్బుంటే కొండమీది కోతినైనా దించొచ్చు అనిపిస్తుందా? నిజమే కావచ్చు కదా.. లేకపోతే మనిషి కుక్కలా మారాలనుకోవడం ఏంటీ.. ఆ విచిత్రమైన కోరికకోసం అన్ని లక్షలు ధారపోయడం ఏంటీ.. ఏంటో జనాలు పుర్రెకో బుద్ది, జిహ్వకో రుచి అని.. విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.
