వేరే వాళ్లకు వచ్చిన ఉత్తరాలు చదవడం సభ్యత అనిపించుకోదు. మన దగ్గర అలా జరిగితే చూసి చూడనట్లు వదిలేయడమో లేదంటే సున్నితంగా మందలించడమో చేస్తాం. అయితే స్పెయిన్‌లో మాత్రం ఇతరుల ఉత్తరాలు చదవటం శిక్షార్హమైన నేరం. సెవిల్లే ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది.

ఈ క్రమంలో తన పదేళ్ల కుమారుడికి అతని అమ్మమ్మ లేఖ రాసింది. అందులో ఆ బాలుడి తండ్రిపై గృహ హింస కేసుకు సంబంధించిన వివరాలను ఆరా తీసింది. ఆ తండ్రిని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.

అయితే తన భార్య తరపువారు తనను మానసికంగా వేధిస్తున్నారని.. తనపై కావాలనే గృహహింస కేసు పెట్టారంటూ కోర్టులో ఆ లేఖను సాక్ష్యంగా సమర్పించాడు ఆ తండ్రి. అయితే ఇక్కడే తేడా కొట్టింది.

అసలు వేరే వారికి వచ్చిన లేఖను ఎలా చదువుతారంటూ న్యాయస్థానం అతనిని ప్రశ్నించింది. ఆ పిల్లాడి గోప్యతకు భంగం కలిగించారంటూ బాలుడి తల్లి తరపు న్యాయవాదులు న్యాయస్థానంలో వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు సదరు తండ్రికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.