వాషింగ్టన్: అమెరికాలో గాంధీ విగ్రహం అపవిత్రం చేయడంపై భారత రాయబార కార్యాలయం తీవ్ర ఆక్షేపణ చెప్పింది.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందు ఉన్న మహత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాలోని గాంధీ విగ్రహాన్ని ఖలీస్తానీ దౌర్జన్యకారులు అపవిత్రం చేశారు.

ఈ విగ్రహంపై బ్యానర్లు, పోస్టర్లు కప్పారు. అంతేకాదు పసుపు ఖలీస్తాన్ అనుకూల నినాదాలు  రాశారు. ఈ విషయాన్ని స్థానిక భద్రత వర్గాల దృష్టికి భారత రాయబార కార్యాలయం తీసుకెళ్లింది.

అహింస, శాంతికి ప్రతీకగా భావించే గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నట్టుగా అమెరికాలోని ఇండియన్ రాయబార కార్యాలయం తెలిపింది.

ఈ విగ్రహం అపవిత్రం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలని కోరింది. నిరసనలు శాంతియుతంగా జరగాలని తాము కోరుకొంటున్నట్టుగా రైతు ఆందోళనలో పాల్గొన్నవారు చెబుతున్నారు.


దేశంలో నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 16 రోజులుగా రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  న్యూఢిల్లీ వేదికగా చేసుకొని రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

రైతులకు మద్దతుగా అమెరికాలో సిక్కులు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, ఇండియానా, ఒహైయో, నార్త్ కరోనాలినా ప్రాంతాల నుండి ర్యాలీగా వచ్చి భారత రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.

ఈ ర్యాలీ మధ్యలో ఖలీస్థానీ వేర్పాటువాదులు తమ జెండాల్ని చేతపబట్టుకొని గాంధీ విగ్రహాన్ని జెండా కప్పి ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు.