న్యూఢిల్లీ: కేరళకు తాము ప్రకటించినట్లు చెబుతున్న రూ.700 కోట్ల ఆర్థిక సాయంపై యుఎఈ ట్విస్ట్ ఇచ్చింది. కేరళకు యూఏఈ ప్రభుత్వం 700కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్రం ఈ ఆర్థిక సాయాన్ని తిరస్కరించినట్లు కూడా వార్తలు వచ్చాయి. 

వివాదం కొనసాగుతుండగానే యుఎఈ దానికి విచిత్రమైన మలుపును ఇచ్చింది.కేరళకు ఆర్థిక సాయానికి సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని  యూఏఈ రాయబారి అహ్మద్ అల్ బన్నా మీడియాతో చెప్పారు. 
వరదల తర్వాత జరిగిన పరిణామాల వల్ల కేరళ ఎంత నష్టపోయింది, ఎంత ఆర్థిక సాయం అవసరమనేది అంచనా వేస్తున్నారని తెలిపారు. కేరళకు 700కోట్లు యూఏఈ ప్రకటించిందనే వార్త నిజం కాదా అని ప్రశ్నిస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటించలేదని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని జవాబిచ్చారు. 

కేరళకు జరిగిన నష్టంపై యూఏఈ జాతీయ విపత్తు కమిటీని ఏర్పాటు చేసిందని, కేరళలో జరిగిన నష్టంపై అంచనా వేసి తమ స్నేహితులైన కేరళ ప్రజలకు ఆర్థిక సాయాన్ని, మందులను పంపించడమే ఈ కమిటీ ఉద్దేశమని ఆయన చెప్పారు.
 
కేరళను ఆదుకునేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి కూడా తాము పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, కేరళకు రూ.700 కోట్ల ఆర్థిక సాయం అందించడానికి యూఏఈ ముందుకొచ్చిందని స్వయంగా కేరళ సీఎం పినరయి విజయన్ కొన్ని రోజుల క్రితం ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 
దీంతో కేరళకు యూఏఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించిందా లేదా అన్న అంశంపై ఇప్పటికే స్పష్టత రాని పరిస్థితి. యూఏఈ నుంచి అధికారిక ప్రకటన వెలువడితే తప్ప ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పడేలా కనిపించడం లేదు.