ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా సోకిన వారు ఐసోలేషన్ లో ఉండాలని సూచిస్తూనే ఉన్నారు. అయితే.. కొందరు మాత్రం వైరస్ ని వ్యాపింపచేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమకు కరోనా లేదంటూ నకిలీ సర్టిఫికెట్లతో వచ్చి అందరినీ బోల్తా కొట్టించాలని చూస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

నకిలీ కొవిడ్-19 సర్టిఫికెట్లతో దేశంలోకి వచ్చిన విదేశీ ప్రయాణీకులను కెన్యా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల కొవిడ్-19 సర్టిఫికెట్లను ఎయిర్‌పోర్టులలో తనిఖీ చేయడం ఆనవాయితీ అయింది. ఇందులో భాగంగానే కెన్యాలోని ఎయిర్‌పోర్టులలో కూడా అధికారులు కొవిడ్-19 సర్టిఫికెట్లను స్కానింగ్ చేస్తున్నారు. తాజాగా జోబో కెన్యాటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన విదేశీయుల సర్టిఫికెట్లను స్పెషల్ స్కానింగ్ చేయగా.. అందులో 17 సర్టిఫికెట్లు నకిలీ అని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వాన్ని మోసం చేసి దేశంలోకి అడుగుపెట్టినందుకు ప్రయాణీకులను అధికారులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కెన్యా నుంచి దుబాయికి వెళ్లిన విమానంలో 100 మంది కెన్యా దేశస్థులు నకిలీ కొవిడ్-19 సర్టిఫికెట్లతో ప్రయాణించినట్టు వార్తలొచ్చాయి. వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. సగం మందికి పైగా పాజిటివ్ అని తేలింది. నకిలీ కొవిడ్-19 సర్టిఫికెట్లతో వస్తున్నారనో లేక ఇతర కారణమో తెలియదు కాని యూఏఈ ప్రభుత్వం కెన్యాతో పాటు 13 దేశాలపై వీసా ఆంక్షలను విధించింది. యూఏఈ వీసా ఆంక్షలు విధించిన తరువాతే కెన్యాలో ఈ సంఘటన చోటుచేసుకోవడం ఆసక్తిగా మారింది.