కజకిస్థాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆల్ మటీ నగరంలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన బెక్ ఎయిర్ కు చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 100మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

వీరీలో 95మంది ప్రయాణికులు కాగా... మిగిలిన ఐదుగురు విమాన సిబ్బంది. కాగా.... ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు అయితే... తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. మిగిలినవారంతా విమాన శకాలల కిందే పడి ఉన్నారని అధికారులు చెబుతున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

కొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా... విమానం టేకాఫ్ అయిన కొద్ది సమయానికే సమీపంలోని రెండంతస్థుల భవనాన్ని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. ఆల్ మటీ నుంచి దేశ రాజధాని నూర్-సుల్తాన్ కు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం నుంచి రాడార్ సంకేతాలు తెగిపోయాయి.  దీంతో రంగంలోకి దిగిన అధికారులు విమానాశ్రయానికి సమీపంలోనే కుప్పకూలినట్లు గుర్తించారు. కాగా.... ఈ ఘటనకు సంబంధించిన ప్రభుత్వం ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కమిషన్ ను నియమిస్తామని తెలిపింది.