Karachi Fire Accident : పాకిస్థాన్ లోని షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
పాకిస్థాన్ లోని కరాచీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం ఏడుగంటల సమయంలో ఓ షాపింగ్ మాల్ చెలరేగిన మంటలు 11 ప్రాణాలను బలిగొన్నాయి. ఈ ప్రమాదంపై సింధ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మక్బూల్ బకర్ విచారం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ లో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కరాచీలోని రషీద్ మిన్హాస్ రోడ్డులో ఉన్న బహుళ అంతస్తుల షాపింగ్ మాల్ లో ఒక్క సారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మరణించినట్లు ‘జియో న్యూస్’ తెలిపింది. మృతదేహాలను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించినట్లు కరాచీ మేయర్ ముర్తజా వహాబ్ ‘ఎక్స్’ ట్విట్టర్ లో ప్రకటించారు.
కాగా.. ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు కేఎంసీ అగ్నిమాపక శాఖ తెలిపింది. 7 మృతదేహాలను జిన్నా ఆసుపత్రికి, ఒక మృతదేహాన్ని సివిల్, అబ్బాసీ షహీద్ ఆస్పత్రులకు తరలించామని పేర్కొంది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఇప్పటి వరకు సుమారు 50 మందిని రక్షించామని పేర్కొంది.
బర్త్ డే రోజు దుబాయ్ తీసుకెళ్లలేదని దారుణం.. భర్తను ముక్కుపై గుద్ది చంపిన భార్య..
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం 7 గంటల సమయంలో మొదటి సారిగా మంటలు చెలరేగాయి. కొన్ని నిమిషాల్లోనే ఆ మంటలు మాల్ లోని నాలుగు, ఐదు, ఆరో అంతస్తులకు వ్యాపించాయి. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
హలాల్ ఉత్పత్తుల నిషేధం..? కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏం చెప్పారంటే ?
ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై సింధ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జస్టిస్ (రిటైర్డ్) మక్బూల్ బకర్ విచారం వ్యక్తం చేశారు. మంటలను అదుపు చేయడానికి తక్షణ చర్యలకు ఆదేశించారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు. కరాచీ డిప్యూటీ కమిషనర్ (డీసీ) సలీం రాజ్ పుత్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దీనిపై విచారణకు ఆదేశించారు. కాగా.. రెండేళ్ల క్రితం ఇదే భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.