Asianet News TeluguAsianet News Telugu

రాజకుటుంబంలో ఎన్నో అవమానాలు.. చచ్చిపోదామనుకున్నా: మేఘన్ మార్కెల్ సంచలన వ్యాఖ్యలు

బ్రిటన్ రాజకుటుంబంలో తాను ఎన్నో అవమానాలకు గురైనట్లు చెప్పారు ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్. రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ దంపతులు టీవీ షో హోస్ట్ ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు

Just Didnt Want To Be Alive Anymore Meghan Markle On Life As Royal ksp
Author
America, First Published Mar 8, 2021, 3:24 PM IST

బ్రిటన్ రాజకుటుంబంలో తాను ఎన్నో అవమానాలకు గురైనట్లు చెప్పారు ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్. రాజకుటుంబం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ దంపతులు టీవీ షో హోస్ట్ ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజకుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మార్కెల్. బ్రిటన్‌ రాణి ఎలిజబిత్‌ 2 మనవడు అయిన ప్రిన్స్‌ హ్యారీ.. 2018లో అమెరికన్ నటి మేఘన్‌ మర్కెల్‌ను వివాహం చేసుకున్నారు. 2019లో వీరికి కుమారుడు ఆర్చీ పుట్టాడు. అయితే కుటుంబంతో విభేదాల కారణంగా గతేడాది హ్యారీ దంపతులు రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. 

ప్రిన్స్‌ హ్యారీని పెళ్లి చేసుకుని బ్రిటన్‌ రాజకుటుంబంలోకి అడుగుపెట్టాక ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక సమస్యలతో బాధపడుతుంటే కుటుంబంలో ఎవరూ సాయం చేయలేదు సరికదా.. తనపైనే నిందలు వేశారని. వీటివల్ల ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయి అంటూ మేఘన్‌ మార్కెల్‌ భావోద్వేగానికి గురయ్యారు. 

హ్యారీని పెళ్లి చేసుకోకముందు తనకు రాచరికపు జీవితం గురించి ఏమాత్రం తెలియదని వెల్లడించారు. రాణి ముందు ఎలా ఉండాలి అనే విషయంపై అవగాహన లేదని మార్కెల్ తెలిపారు. హ్యారీతో వివాహం అయిన తొలినాళ్లలో ఈ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని... ప్యాలెస్‌లోకి వచ్చాక ఇలా ఉండాలి అలా చేయాలంటూ అనేక ఆంక్షలు ఉండేవన్నారు. దీంతో ఒక్కోసారి చాలా ఒంటరిగా అనిపించేదని.. నెలల తరబడి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని మార్కెల్ గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో చీకట్లో ఉన్నట్లు అనిపించేదని.. అలా మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తున్నప్పటికీ రాజకుటుంబంలో ఒక్కరు కూడా తనకు సాయం చేయలేదని మార్కెల్ విమర్శించారు. 

తాను గర్భవతిగా ఉన్న సమయంలో పుట్టబోయే బిడ్డ రంగు గురించి రాజకుటుంబంలో చర్చ జరిగిందని తెలిపారు. ఎందుకంటే తాను నల్లగా ఉన్నాను కాబట్టి.. నా బిడ్డ ఆర్చీ కూడా నల్లగానే పుడతాడని వారు ఆందోళనకు గురయ్యారట. దీనిపై హ్యారీతో సైతం వారు చర్చించారని ఉద్వేగానికి గురయ్యారు మార్కెల్. అంతేగాకుండా, తమ బిడ్డకు భద్రత ఉండదని, టైటిల్‌ కూడా రాదని మాట్లాడుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకుటుంబంతో తనకు సఖ్యత లేదని, తన వల్ల తోడికోడలు కేట్‌ ఏడ్చిందని గతంలో వార్తలు వచ్చాయని కానీ అవేవి వాస్తవాలు కాదని అందరికీ తెలుసునని మార్కెల్ కుండబద్ధలు కొట్టారు. పెళ్లి రోజున ఫ్లవర్‌ గర్ల్‌ దుస్తుల విషయంలో కేట్‌ కాస్త అసంతృప్తికి గురయ్యారని.. ఆ విషయం తెలిసి తాను చాలా బాధపడ్డానని ఆమె స్పష్టం చేశారు. అయితే, ఆ తర్వాత కేట్‌ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగిందని.. కానీ బయట మాత్రం తప్పు తనదేనన్నట్లు ప్రచారం జరిగిందని మేఘన్ తెలిపారు.

2018 మే 19న బ్రిటన్‌ విండ్సోర్‌ క్యాస్టిల్‌లో అధికారికంగా మా వివాహం జరిగిందని.. అయితే, అంతకంటే మూడు రోజుల ముందే ప్రైవేటుగా తాము పెళ్లి చేసుకున్నట్లు మార్కెల్ తెలిపారు. కేవలం తమ సంతోషం కోసమే ఇలా చేసుకున్నామని ఆమె వెల్లడించారు.

అటు భార్యకు పూర్తి మద్ధతుగా మాట్లాడారు ప్రిన్స్ హ్యారీ. తను కేవలం మేఘన్‌ కోసమే రాజకుటుంబం నుంచి బయటకు రాలేదని ఆయన స్పష్టం చేశారు. తనను ట్రాప్‌ చేశారు అంతేకాకుండా తన తండ్రి, సోదరుడిని కూడా ట్రాప్‌ చేశారని హ్యారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాచరిక విధుల నుంచి వెనక్కి తగ్గుతున్నాం అని ప్రకటించిన తర్వాత 2020 ఆరంభంలో రాజకుటుంబం నుంచి డబ్బులు రావడం ఆగిపోయిందని ఆయన తెలిపారు. ఆ సమయంలో తన తల్లి ప్రిన్సెస్‌ డయానా తన కోసం వుంచిన డబ్బుతో నెట్టుకొచ్చాని ప్రిన్స్ హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ పెళ్లి తర్వాత కుటుంబంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన అన్నారు. తానెప్పుడూ నా కొడుకుకు రాజకుటుంబంలో హోదా రావాలని కోరుకోలేదని.. అలాగే దానిపై ఎవరితోనూ చర్చించలేదని ప్రిన్స్ హ్యారీ తెలిపారు. తన తల్లి జీవితంలో జరిగినట్లుగానే నా జీవితంలోనూ జరుగుతుందేమోనని భయపడ్డానని...చివరికి నిస్సహాయ స్థితిలోనే రాజకుటుంబాన్ని వదిలి వచ్చేద్దామని అనుకున్నట్లు హ్యారీ పేర్కొన్నారు. తన భార్య, కుమారుడు ఆర్చీ కోసమే బయటకు వచ్చేశానని ఆయన స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios