జైషే మొహమ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్‌ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం రావల్పిండిలోని పాక్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యానికి చెందిన అధికారులు తెలిపారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న అతను ప్రతీరోజు డయాలసిస్ జరుగుతోందని తెలిపారు. అంతకు ముందు మసూద్ తమ దేశంలోనే ఉన్నట్లు ఒప్పుకోవడంతో పాటు తమకు టచ్‌లోనే ఉన్నాడని స్వయంగా పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి అంగీకరించిన సంగతి తెలిసిందే.

భారత్ అంటే నిలువెల్లా రగిలిపోయే మసూద్ అజార్ జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నాడు. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌తో మసూద్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.