వరుస మరణాలు ఫుట్ బాల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. దిగ్గజ ఆటగాళ్లు అసువులు బాస్తున్నారు. ఫుట్ బాల్ ప్రేమికులను విషాదంలో ముంచేస్తున్నారు. తాజాగా  ఫుట్‌బాల్‌ ప్రపంచానికి మరో షాక్‌ తగిలింది. 

డీగో మారడోనా విషాదం మరవక ముందే మరో దిగ్గజ ఆటగాడు కన్ను మూశాడు. ఇటలీ దిగ్గజ ఫుట్‌ బాలర్‌ పాలో రోసి తన 64వ యేట మృతి చెందాడు. 1982లో ఫుట్ బాల్ ప్రపంచకప్‌లో ఇటలీ జగజ్జేతగా నిలవడంలో పాలో రోసి కీలకపాత్ర పోషించాడు. 

రోసీ మరణవార్తను ఆయన భార్య ఫెడెరికా కాపెల్లేటి ఇన్‌స్టాగ్రామ్‌లో దృవీకరించారు. రోసి.. మిస్‌ యూ ఫర్‌ ఎవర్‌ అని ఉద్వేగభరితమైన పోస్టు చేశారామె.

1982 ప్రపంచకప్‌లో పాలో రోసి 6 గోల్స్‌తో టాప్‌ స్కోరర్‌గా గోల్డెన్‌ బూట్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా గోల్డన్‌ బాల్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఒక ప్రపంచకప్‌లో టైటిలతో పాటు గోల్డెన్‌ బూట్, గోల్డన్‌ బాల్ గెలుచుకున్న ముగ్గురిలో ఒకరిగా నిలవడం విశేషం.