టర్కీలో టీవీలో ప్రవచనాలు చెప్పే అద్నాన్ ఒక్తార్‌కు ఇస్తాంబుల్ కోర్టు 8,658 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లైంగిక దాడులు,వేధింపుల కేసులో ఆయనకు ఈ శిక్ష వేసింది. ఆయన తన బోధనలను టీవీల్లో కురుచ దుస్తులు, దట్టమైన మేకప్ వేసుకుని ఉండే మహిళల మధ్యలో కూర్చుని ప్రవచనాలు చెబుతుంటాడు. 

న్యూఢిల్లీ: ముస్లిం ప్రవచనారుడు, టీవీలో మత బోధనలు చేస్తుండే అద్నాన్ ఒక్తార్‌కు 8,658 ఏళ్ల జైలు శిక్ష పడింది. అద్నాన్ ఒక్తార్ ఇస్తాంబుల్‌లో టీవీ చానెల్‌లో ప్రోగ్రామ్ నిర్వహిస్తుంటాడు. కురుచు దుస్తులతో, విపరీతమైన మేకప్‌తో మహిళలను తన చుట్టూ నిలబెట్టుకుని కనిపించే ఈ బోధకుడిపై చాలా వివాదాలు ఉన్నాయి. ఆయన సృష్టితత్వం, కన్జర్వేటివ్ విలువల గురించి బోధిస్తూ ఉంటాడు. ఆయనపై లైంగిక వేధింపులు, లైంగిక దాడి ఆరోపణల పై విచారణ జరిగింది. ఈ విచారణలో ఆయనకు 8,658 సంవత్సరాల జైలు శిక్షను ఇస్తాంబుల్ కోర్టు విధించింది. 

గతేడాది 66 ఏళ్ల ఈ ఒద్నాక్ ఒక్తార్‌కు మైనర్లపై లైంగికదాడులు, వేధింపులు, ఫ్రాడ్, రాజకీయ, మిలిటరీ గూఢచర్యం వంటి ఆరోపణల కింద 1,075 సంవత్సరాల జైలు శిక్ష పడింది. కానీ, ఈ తీర్పును ఎగువ న్యాయస్థానం తప్పుపట్టింది.

Also Read: యువతిపై గ్యాంగ్ రేప్ లో.. అండమాన్ మాజీ సీఎస్ జితేంద్ర నరైన్ అరెస్ట్..

అద్నాన్ ఒక్తార్ పై నమోదైన కేసుల పునర్విచారణలో ఇస్తాంబుల్ హై క్రిమినల్ కోర్టు 8,658 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. లైంగిక వేధింపులు, ఇతరుల స్వేచ్ఛను హరించడం వంటి ఆరోపణల కింద ఈ శిక్ష పడింది. అద్నాన్ ఒక్తార్‌తోపాటు మరో పది మందికి 8,658 ఏళ్ల చొప్పున జైలు శిక్ష పడినట్టు అనడోలు అనే న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది.

ఆన్‌లైన్ ఏ9 టెలివిజన్ చానెల్‌లో ప్రోగ్రాములతో ప్రాచుర్యం పొందిన అద్నాన్ ఒక్తార్‌ను కొందరు కల్ట్ లీడర్ అంటారు. కానీ, టర్కీలోని మత పెద్దలు అంతా ఆయనను తీవ్రంగా విమర్శిస్తారు.

అద్నాన్ ఒక్తార్ గ్రూప్‌పై 2018లో పోలీసులు విరుచుకుపడ్డారు. అప్పుడు అద్నాన్ ఒక్తార్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు. ఆర్థిక నేరాల ఆరోపణలపై ఆయనను విచారించారు.