అరబ్ దేశాలతో సుదీర్ఘ వైరం, సంఘర్షణ నేపథ్యంలో చారిత్రక సమావేశానికి ఇజ్రాయెల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి అమెరికా, యూఏఈ, బహ్రెయిన్, మొరాకో దేశాల విదేశాంగ మంత్రులు హాజరుకానున్నారు. 

ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని పునరుద్ధరించే చర్చలు సందిగ్థంలో వున్న నేపథ్యంలో ఇజ్రాయిల్ (Israel) వచ్చే వారం చారిత్రాత్మకమైన ‘‘ఫైవ్ వే రీజనల్ కాన్ఫరెన్స్’’కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖ మంత్రి యాయిర్ లాపిడ్ (Yair Lapid) వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ (Antony Blinken) సహా యూఏఈ (UAE), బహ్రెయిన్ (Bahrain ) , మొరాకో (Morocco) దేశాల విదేశాంగ మంత్రులు ఆది, సోమవారాల్లో జరిగే దౌత్య సమావేశాల కోసం ఇజ్రాయెల్‌కు చేరుకుంటారని లాపిడ్ ఒక ప్రకటనలో తెలిపారు. 

యూఏఈ, బహ్రెయిన్‌లు 2020లో ఇజ్రాయెల్‌తో సంబంధాలను పునరుద్ధరించాయి. అబ్రహం ఒప్పందాలు అని పిలవబడే అమెరికా మధ్యవర్తిత్వ ఒప్పందం ప్రకారం.. ఇరాన్‌పై పరస్పర ఆందోళన కారణంగా ఇజ్రాయెల్ ఒక కొత్త ప్రాంతీయ డైనమిక్‌ను ఏర్పరిచింది. మొరాకో గతేడాది ఇదే విధానాన్ని అనుసరించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రెండు దేశాలు సైనిక సహకారంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయని ఇజ్రాయెల్ సైన్యంలోని అరబిక్ అధికార ప్రతినిధి అవిచాయ్ ఆడ్రీ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

ఈజిప్ట్, ఇజ్రాయెల్, యూఏఈ నాయకులు మంగళవారం ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇరాన్ ప్రభావం నేపథ్యంలో ఆర్ధిక పరిస్ధితులపై చర్చించారు. ఈ మేరకు ఎర్ర సముద్రం తీరంలోని షర్మ్ ఎల్ షేక్‌లో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా.. ఇజ్రాయెల్- ఈజిప్ట్‌లు 1979లో శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. 

దశాబ్ధాల శత్రుత్వం, సంఘర్షణ అనంతరం ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందంపై సంతకం చేసిన తొలి అరబ్ దేశం ఈజిప్ట్. తర్వాత 1994లో జోర్డాన్‌ దీనిని అనుసరించింది. ఇకపోతే ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న ఈ చారిత్రాత్మక సమావేశం ఎక్కడ జరుగుతోందో తెలియరాలేదు. కాకపోతే.. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లా ప్రధాన కార్యాయలంలోని పాలస్తీనా నాయకుడు మహమూద్ అబ్బాస్‌ను కలవడానికి ముందు బ్లింకెన్.. ఇజ్రాయెల్‌ ప్రధానితో చర్చలు జరపాల్సి వుంది. దీని తర్వాత అల్జీరియా, మొరాకోలలో బ్లింకెన్ పర్యటించాల్సి వుంది.