ఇరాన్ అత్యధికంగా మరణ శిక్షలు అమలు చేస్తున్నది. ఆ దేశంలోని మైనార్టీలపైనే మరణ శిక్షలు ఎక్కువగా అమలు అవుతున్నాయి. తాజాగా, సోమవారం ఒకే రోజు 12 మంది మైనార్టీలకు ఉరి శిక్ష వేసింది. ఇందులో ఒక మహిళ ఉన్నారు.

న్యూఢిల్లీ: ఇరాన్ కఠిన శిక్షలు అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఉరి శిక్షలు ఎక్కువగా అమలు చేస్తున్నది. సోమవారం ఒక్క రోజే ఇక్కడ ఒక మహిళ సహా 12 మందికి ఉరి శిక్ష వేసింది. ఇరాన్‌లోని సిస్టన్ బలుచెస్తాన్ ప్రావిన్స్‌లో జహెదాన్‌లోని ప్రధాన కారాగారంలో ఈ శిక్ష అమలు చేసింది. ఈ విషయాన్ని నార్వేకు చెందిన ఎన్జీవో ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్) వెల్లడించింది. డ్రగ్స్ సంబంధ కేసుల్లో దోషిగా తేలిన వారు.. మర్డర్ కేసుల్లోనూ దోషిగా తేలినవారే వీరంతా అని పేర్కొంది. 

సిస్టన్ బలుచెస్తాన్ ప్రావిన్స్.. పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్నది. 

ఉరి శిక్ష పడిన 12 మంది కూడా బలూచ్ ఎత్నిక్‌కు చెందినవారే కావడం గమనార్హం. ఇరాన్‌లో బలూచ్‌లు మైనార్టీలు. బలూచ్‌లు సున్నీవర్గానికి చెందినవారు. కానీ, ఇరాన్‌లో షియాలు మెజార్టీలు. ఇరాన్ మైనార్టీలను ఎక్కువ మందిని శిక్షల పేరుతో హతమారుస్తున్నదనేది మానవ హక్కుల సంఘాల ఆరోపణ. ఈ సామూహిక మరణ శిక్షలు గుట్టుగా అమలు చేయడం గమనార్హం. ఈ 12 మరణ శిక్షల గురించి కనీసం స్థానిక మీడియాలోనూ వార్తలు రాలేదు. ఏ అధికారి కూడా కనీసం ధ్రువీకరించలేదని ఐహెచ్‌ఆర్ తెలిపింది.

12 మందిలో ఒకరైన మహిళను ఇంటి పేరు గార్గిజ్‌గా గుర్తించారు. ఆమె తన భర్తను హతమార్చిన కేసులో 2019లో అరెస్ట్ అయింది. తాజాగా, ఆమెకు మరణ శిక్ష అమలు చేశారు.

ఇరాన్ ఎక్కువగా మరణ శిక్షలను తెగ, లేదా మతపరమైన మైనార్టీలపైనే ఎక్కువగా అమలు చేస్తున్నదని ఐహెచ్‌ఆర్ వాదిస్తున్నది. ఇరాన్‌లో కుర్ద్‌లు, అరబ్బులు, బలూచ్‌లు మైనార్టీలు.

ఈ సంస్థ సేకరించిన వివరాల ప్రకారం, 2021లో మరణ శిక్షకు గురైన వారిలో 21 శాతం మంది బలూచ్ ఖైదీలే. కానీ, ఇరాన్ దేశ జనాభాలో వారి శాతం 2 నుంచి 6 శాతంగా ఉన్నది. అంటే వారి జనాభా దామాషాలతో పోలిస్తే.. కనీసం మూడు రెట్ల కంటే ఎక్కువగా ఈ బలూచ్‌లే మరణ శిక్షకు గురయ్యారని స్పష్టం అవుతున్నది.

ఇరాన్ ఇటీవలే మరణ శిక్షలను ఎక్కువగా అమలు చేస్తున్నట్టు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇరాన్ (ఎన్‌సీఆర్ఐ) వెల్లడించింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడం, ఇతర సమస్యలతో ఇరాన్‌లో అధికారానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణిచవేత మార్గాలు ఎక్కువగా అమలు చేస్తున్నదని ఇరాన్ నిషేధిత ఎన్‌సీఆర్ఐ వెల్లడించింది.

ఐహెచ్ఆర్ ప్రకారం 2021లో 333 మందికి ఉరి శిక్ష వేశారు. 2020తో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా మరణ శిక్షల అమలుకు సంబంధించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ నివేదిక ప్రకారం, ఇరాన్‌లో గతేడాది కంటే 2021లో 28 శాతం మరణ శిక్షల అమలు పెరిగిందని తెలిపింది.