ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్ధలవ్వడంతో సంభవించిన సునామి  బీభత్సం సృష్టించింది. ఈ సునామి కారణంగా ఇప్పటి వరకు 281 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 220మంది ప్రాణాలు కోల్పోగా... కాగా.. నేటికి మృతుల సంఖ్య 281 కి చేరింది. 

దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మరో 28 మంది గల్లంతయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కారణంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. 

క్రాకటోవా ‘శిశువు’గా పిల్చుకునే ఓ అగ్నిపర్వతం శనివారం రాత్రి 9 గంటల సమయంలో బద్దలైన సంగతి తెలిసిందే. సరిగ్గా 24 నిమిషాల తర్వాత నీటి లోపల భూమి కంపించి సునామీ సంభవించింది. సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.