అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకి గ్రీన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఒకప్పుడు గ్రీన్ కార్డ్ పొందాలంటే ఐదారేళ్ల సమయం పట్టేది. అయితే, ఇప్పుడు అదే గ్రీన్ కార్డ్ పొందాలంటే 150 సంవత్సరాలకు పైనే వేచి ఉండాల్సి రావచ్చు. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, ఇదే నిజమని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 

కాటో ఇనిస్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్20, 2018 నాటికి గ్రీన్‌కార్డుల కోసం 6,32,219 మంది భార‌తీయులు ధరఖాస్తు చేసుకున్నట్లు అక్కడి లెక్కలు చెబుతున్నాయి. ఇలా ధరఖాస్తు చేసుకున్న వారిలో అమెరికాలోకి వలస వచ్చిన ఉద్యోగులతో పాటు వారి జీవితభాగస్వాములు, పిల్లలు కూడా ఉన్నారు.

గ్రీన్ కార్డులను జారీ చేసేటప్పుడు అమెరికా ప్రభుత్వం అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది. చట్టబద్ధంగా తమ దేశంలోకి ప్రవేశించి, అత్య‌ధిక నైపుణ్యాల విభాగంలోని అసాధార‌ణ సామ‌ర్థ్యం విభాగం  క్రిందకు వచ్చే ఉద్యోగులకు సుమారు ఐదారేళ్ల వ్యవధిలోనే గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. దీనినే ఈబి1 విభాగం (EB1 Category) అంటారు.

ఈ విభాగంలో ఇప్పటికే  34,824 ధరఖాస్తులు పెండింగులో ఉన్నాయని ఆ గణంకాలు చెబుతున్నాయి. అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం విడుదల చేసిన లెక్కల ప్రకారం, ఈబి1 విభాగంలో ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులతో పాటుగా వారి జీవితభాగస్వాములు, పిల్లలు కూడా ఉన్నారు. వీరి సంఖ్య సుమారు 83,578.

ఇక ఈబి3 విభాగం విషయానికి వస్తే.. బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండి గ్రీన్ కార్డు కోసం ధరఖాస్తు చేసుకున్న భారతీయుల సంఖ్య దాదాపు 54,892, వారిపై ఆధారపడి గ్రీన్ కార్డ్ కోసం ధరఖాస్తు చేసుకున్న జీవితభాగస్వాములు, పిల్లల సంఖ్య 60,381. 

అన్నింటికన్నా ఎక్కువగా ఈబి2 విభాగంలో ధరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీరి సంఖ్య మొత్తంగా 4,33,368. ప్రస్తుత చట్టాల ప్రకారం, అమెరికాలో ప్రతి దేశానికి 7 శాతం మాత్రమే గ్రీన్ కార్డులను కేటాయిస్తుంది. ఈ లెక్కన చూసుకుంటే, అమెరికాలోని భారతీయులందరికీ గ్రీన్ కార్డ్ రావటానికి సుమారు 151 ఏళ్ల సమయం పట్టవచ్చని కాట్ ఇనిస్టిట్యూట్ అధ్యయనం చెబుతోంది.