అమెరికాలో భారత టెకీ కొవిడ్ లోన్ ఫ్రాడ్ చేసినట్టు తేలింది. లేని కంపెనీలను ఉన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి రిలీఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చివరికి ఫేక్ అని తేలగా ముకుంద్ మోహన్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడింది.

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం అందించిన కొవిడ్ లోన్‌ల కోసం 48ఏళ్ల ఇండియన్ టెకీ అడ్డదారి తొక్కాడు. లేని డాక్యుమెంట్లు సృష్టించి లోన్లు పొందాడు. చివరికి దర్యాప్తులో దొరకడంతో దోషిగా తేలాడు. రెండేళ్ల జైలు శిక్షను పొందాడు.

ముకుంద్ మోహన్ గతంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లలో ఉద్యోగం చేసిన ముకుంద్ మోహన్ అనే టెకీ వాషింగ్టన్‌లోని క్లైడ్ హిల్‌లో నివాసముంటున్నాడు. కరోనా సంక్షోభ సమయంలో అమెరికా ప్రభుత్వం టెక్ కంపెనీలను ఆదుకోవడానికి కొవిడ్-19 డిజాస్టర్ రిలీఫ్ లోన్‌లను ప్రకటించింది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆయన ఏకంగా లేని కంపెనీలు ఉన్నట్లుగా డాక్యుమెంట్లు సృష్టించాడు. అవి కాగితంపైనే కంపెనీలు.. నిజంగా లేవు. మొత్తం ఎనిమిది నకిలీ లోన్ అప్లికేషన్లు పెట్టుకున్నాడు. వీటి ద్వారా సుమారు 5.5 మిలియన్ల అమెరికన్ డాలర్లను పొందాలని చూశాడు.

నకిలీ దరఖాస్తు పత్రాలకు ఫేక్ ఫెడరల్ ట్యాక్స్ ఫైలింగ్స్, ఇతర నకిలీ దస్త్రాలనూ క్రియేట్ చేశాడు. మోహన్ తనకు 2019లో మహెంజో అనే కంపెనీ ఉండేదని, అందులో పదుల సంఖ్యలో ఉద్యోగులుండేవారని, వారికి మిలియన్ల డాలర్లు జీతాలు ఇచ్చేవాడని పేర్కొన్నాడు. అప్పుడు ట్యాక్స్ కట్టినట్టూ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. నిజానికి ఈ కంపెనీని మోహన్ 2020లో కొనుగోలు చేశాడు. ఆయన కొనుగోలు చేసినప్పుడు కంపెనీలో ఉద్యోగులెవరూ లేరు.

ఆయన దరఖాస్తు చేసుకున్న ఎనిమిది నకిలీ అప్లికేషన్లలో ఐదు ఆమోదం పొందాయి. తద్వారా ఆయన అక్రమంగా 1.8 మిలియన్ల అమెరికన్ డాలర్లను కొవిడ్ రిలీఫ్ ఫండ్‌గా పొందాడు. కానీ, ఆయన బూటక నాటకం తెలిసి విచారణ చేయడంతో తప్పును అంగీకరించాడు. తాజాగా, కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాదు, ఒక లక్ష అమెరికన్ డాలర్ల జరిమానా, 1.7 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.