ఉక్రెయిన్‌లో భారతీయ విద్యార్ధి నవీన్ మరణంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. సరుకులు కొనడానికి బయటకు వెళ్లి కాల్పుల్లో చిక్కుకుని అతను ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని భారత్‌కు తరలించే విషయమై అడగ్గా.. ప్రస్తుతం ఆ ప్రాంతం వార్ జోన్‌లో వుందని, భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచామని విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్‌ను (ukraine ) స్వాధీనం చేసుకునేందుకు రష్యా (russia) శతవిధాల ప్రయత్నిస్తోంది. ఈ స్థాయిలో ప్రతిఘటన వుంటుందని ఊహించలేని రష్యా.. భీకరదాడులతో విరుచుకుపడుతోంది. నగర ప్రాంతాలను ఆక్రమించుకోవడం రష్యాకు కత్తిమీద సాములా మారింది. ముఖ్యంగా ఉక్రెయిన్ వాసులు కూడా ఆయుధాలు చేతపట్టి రష్యా సేనలపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. పరిస్ధితుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వున్న భారతీయ విద్యార్ధులను (indian students) తరలించేందుకు కేంద్రం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు పరిస్ధితిని వివరిస్తూ ట్రావెల్ అడ్వైజరీలను జారీ చేస్తోంది. ఈ క్రమంలో రష్యా దాడుల్లో మనదేశానికి చెందిన విద్యార్ధి మరణించడంతో భారత్‌తో పాటు అంతర్జాతీయ సమాజం ఉలిక్కిపడింది.
మృతుడిని కర్ణాటకకు (karnataka) చెందిన నవీన్‌గా (naveen) గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ (ministry of external affairs) అధికారిక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ శాఖలకు కేంద్రం ఫోన్ చేసి .. తమ విద్యార్ధుల తరలింపునకు సహకరించాల్సిందిగా కోరింది. నవీన్ స్వస్థలం కర్ణాటక రాష్ట్రం హవేరి. ఇతను ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. నవీన్ మరణం పట్ల విదేశాంగ శాఖ తీవ్ర సంతాపం తెలిపింది.
అయితే నవీన్‌ను అసలు రష్యా సేనలు ఎందుకు లక్ష్యంగా చేసుకోవాల్సి వచ్చిందినే దానిపై క్లారిటీ లేదు. కాకపోతే.. మృతుడి సమీప బంధువుకు విదేశాంగశాఖ అధికారులు చెప్పిన దానిని బట్టి.. బంకర్‌లో వుంటున్న నవీన్ మంగళవారం ఉదయం సరుకులు తెచ్చుకోవడానికి దగ్గరలోని స్టోర్‌కు వెళ్లాడు. అక్కడ పనిముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. అప్పటికే రష్యా సేనలు నగరంలోకి చొచ్చుకురావడం, ఉక్రెయిన్ సేనలు వారిని ప్రతిఘటిస్తుండటం జరుగుతోంది.
ఇరు పక్షాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్న వార్ జోన్‌లోకి నవీన్ ప్రవేశిం అతనిపై కాల్పులు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. గాయాలతో ఆసుపత్రిలో వున్నాడు.. లేక చనిపోయాడా అని నవీన్ బంధువు ప్రశ్నించగా.. అతను చనిపోయినట్లు 100 శాతం ధ్రువీకరణ అయ్యిందని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించే విషయమై అడగ్గా.. ప్రస్తుతం ఆ ప్రాంతం వార్ జోన్‌లో వుందని, భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచామని.. పరిస్ధితులు చక్కబడిన తర్వాత స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని విదేశీ వ్యవహారాల శాఖ సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
