సింగపూర్ లోని ఓ నగల షాపులో జరిగిన దొంగతనం కేసులో భారత్ కు చెందిన ఓ వ్యక్తికి అక్కడి న్యాయస్థానం సోమవారం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వీరామణి సుబ్రాన్ దాస్(37) అనే భారతీయుడు మరో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులతో కలిసి ఈ చోరీ చేసినట్టు విచారణలో తేలింది.

గతేడాది ఆగస్టు 13న ఆంగ్ మో కియో అవెన్యూ 10లోని హాక్ చెయాంగ్ జడే అండ్ జ్యువెలరీ దుకాణంలో చోరీ జరిగింది. దుకాణంలో పనిచేసే జగదీష్ అనే వ్యక్తి ఈ దొంగతనానికి ప్లాన్ చేశాడు. దుకాణం యజమానులు లింగ్ హ్యూ క్వాంగ్(70), అతని సోదరుడు లెంగ్ యూ వెంగ్(75) వృద్ధులు కావడంతో సులభంగా దోచుకోవచ్చని అనుకున్నాడు. ఇదే విషయం చెప్పి సర్వీంద్రన్ సుప్పయ్య, సుబ్రన్ దాస్ లన ఒప్పించాడు. 

ఈ ముగ్గురు చోరీకి ప్రయత్నించిన నగల విలువ 87,880 అమెరికన్ డాలర్లు(రూ.65.40 లక్షలు). అయితే, యజమానులు చాకచక్యంగా దుకాణంలో దొంగతనం లేదా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అలారంను మోగించారు.

దీంతో అప్రమత్తమైన దుకాణం సెక్యూరిటీ సిబ్బంది  నగలతో షాపు నుంచి జగదీష్ బయటకు రాగానే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో మిగతా ఇద్దరి పేర్లను అతడు బయటపెట్టడంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో న్యాయస్థానం ఈ దొంగతనంలో హస్తమున్న వీరామణి సుబ్రాన్ దాస్‌ను దోషిగా తేల్చి, మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.