ఓ భారతీయుడు శ్రీలంక పోలీసుల కస్టడీలో మరణించడం దౌత్య వర్గాల్లో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... 45 ఏళ్ల భారతీయుడిని మార్చి 18న శ్రీలంక పోలీసులు వాయువ్య ప్రావిన్స్‌లోని కులియాపిటియాలోని అదుపులోకి తీసుకున్నారు.

ఓ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేశాడని అభియోగంతో అతనిని అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా.. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. దాంతో పోలీసులు అతడిని వారియోపోల జైలుకు తరలించారు.

అప్పటి నుంచి అతడు పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇటీవల అతడు శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుండటంతో జైలు అధికారులు వారియోపోల ఆస్పత్రికి తరలించారు.

అయితే మంగళవారం అతను ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, మృతుడు 16 ఏళ్ల కిందే శ్రీలంకకు వలస వచ్చి, అక్కడి మహిళనే పెళ్లి చేసుకుని ఈ దేశంలోనే స్థిరపడినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుడి పేరు తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.