చైనాతో స్నేహం ఎంత ప్రమాదకరమో నేపాల్‌కు మెల్లమెల్లగా తెలిసివస్తోంది. భారత్‌పై కాలుదువ్వుతూ, చైనాకు వంతపాడుతున్న నేపాల్‌ ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా మారింది. భారత నిఘా సంస్థలు వెల్లడించిన సమాచారం ప్రకారం, నేపాల్‌లోని 7 సరిహద్దు జిల్లాల్లో చాలా చోట్ల చైనా తిష్ఠ వేసింది. నేపాల్ భూమిని అక్రమంగా ఆక్రమించుకుంది. 

నేపాల్ సరిహద్దుల్లో 7 జిల్లాల్లోని భూభాగాలను చైనా ఆక్రమించిందని భారతీయ నిఘా సంస్థలు తెలిపాయి. చైనా సామ్రాజ్యవాద ఎజెండాను కప్పిపుచ్చేందుకు నేపాలీ కమ్యూనిస్టు పార్టీ ప్రయత్నిస్తుండటంతో వాస్తవ పరిస్థితి దయనీయంగా ఉందని పేర్కొన్నాయి.

నేపాలీ సర్వే డిపార్ట్‌మెంట్ కూడా ఆ దేశ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీకి చైనా దురాక్రమణ గురించి చెప్పినప్పటికీ, ఆయన పట్టించుకోలేదని తెలిపాయి. డోలాఖా, గోర్ఖా, దార్చులా, హుమ్లా, సింధుపల్‌చౌక్, శంకువసభ, రసువ జిల్లాల్లోని చాలా భూభాగాల్లో చైనా తిష్ఠ వేసిందని తెలిపాయి.

రుయి గ్రామ ప్రజలు నేపాల్‌కు పన్నులు చెల్లిస్తుండగా, ఆ గ్రామాన్ని టిబెట్ అటానమస్ రీజియన్‌లో చైనా చేర్చిందని తెలిపాయి. ఇదిలావుండగా, భారత దేశంలోని భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ నేపాల్ మ్యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే.

లింపియధుర, కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలు తమవేనని నేపాల్ పేర్కొంటోంది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే చైనా తన భూభాగాలను ఆక్రమిస్తున్నప్పటికీ నేపాల్ స్పందించకపోవడం విశేషం.

2005 నుంచి సరిహద్దులపై చర్చలు జరపకుండా నేపాల్ వెనుకంజ వేస్తోంది. చైనాతో 17 జిల్లాల్లో 1,400 కిలోమీటర్లు, భారత్‌తో 27 జిల్లాల్లో 1,800 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులను నేపాల్ కలిగి ఉంది.