సరదాగా గడుపుదామని భార్య, కూతురితో కలిసి సింగపూర్‌ వెళ్లిన ఓ భారతీయ డాక్టర్ ఓ  సిగ్గులేని  పని చేసి కటకటాల పాలయ్యాడు. స్విమ్మింగ్ పూల్‌లో అంతమంది అమ్మాయిలు ఉండేసరికి అతనిలోని కామాంధుడు బయటకొచ్చి వికృత చేష్టలు చేయడంతో కటకటాల పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే. భారత్‌కు చెందిన జగ్దీప్ సింగ్ అరోరా అనే 46 ఏళ్ల వైద్యుడు రెండు వారాలు గడుపుదామని భార్య, కూతురుని వెంటబెట్టుకుని సింగపూర్ వెళ్లాడు..

గత నెల 28న సాయంత్రం మెరీనా బే శాండ్ హోటల్‌లో బస  చేశాడు.. అదే రోజు సాయంత్రం హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లోకి కూతురితో కలిసి దిగాడు. అక్కడ అప్పటికే ఉన్న అమ్మాయిలను చూసి మనోడిలో ఉన్న కీచకుడు బయటకు వచ్చాడు.. అంతే అక్కడున్న నలుగురైదుగురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు.. తాకరాని చోట తాకాడు. అలా రాత్రి 9  గంటల నుంచి అర్థగంట సేపు వికృత చేష్టలు చేశాడు..

దీంతో లుథియానాకి చెందిన 25 ఏళ్ల ఓ బాధితురాలు హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే అతను ఇలా అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తేల్చారు. ఈ నేరంపై అతనికి కనిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.