అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయం వెనుక భారతీయులు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన భారతీయ సమాజం డెమొక్రాట్ల పక్షాన నిలవడంతో ట్రంప్‌కు రెండోసారి అధ్యక్ష పీఠం దూరమైంది.

ఇక బైడెన్ సైతం తన సలహాదారులుగా భారతీయులనే నియమించుకోవడంతో పాటు ఇండో అమెరికన్ మహిళా నేత కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ప్రకటించారు.

ఈ వ్యూహాలన్నీ ఫలించి అంతిమంగా ఆయన విజయానికి కారణమయ్యాయి. ఇక బైడెన్ గెలిస్తే కీలక పదవి దక్కే అవకాశాలున్నట్లుగా తొలి నుంచి వినిపిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ మూర్తికి అది ఖాయమైనట్లుగానే కనిపిస్తోంది. 

Also Read:అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020: వైట్‌హౌస్‌కి ట్రంప్ రెండోసారి దూరం కావడానికి కారణాలివీ....

డాక్టర్‌ వివేక్‌ మూర్తికి టాస్క్‌ఫోర్స్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన మూర్తిని 2014లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా 19వ సర్జన్ జనరల్ గా నియమించారు.  

అమెరికాలో కరోనా వైరస్ అదుపునకు కొత్త టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి మూర్తినే చీఫ్‌గా నియమిస్తారని సమాచారం. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 

ఇక అమెరికాలో కరోనా వైరస్‌ కొత్త కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయి కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులోనే 1.24లక్షల కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. మరోవైపు ఒక్క రోజే 1,031 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1.01 కోట్లకు పైగా కరోనా కేసులు, 2.43లక్షల మరణాలు సంభవించాయి.