తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక పౌరులకు భారత్ అండగా నిలబడుతుందని కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ప్రకటనలో తెలిపారు. పొరుగు దేశాలకు భారత్ తొలి ప్రాధాన్యత ఇస్తుందని, ఇప్పటికే సుమారు 3.8 బిలియన్ల అమెరికన్ డాలర్లతో సహకారాన్ని అందించిందని తెలిపారు. 

న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రతరం కావడంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారు పోరాట రూపం తీసుకోవడంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసం వదిలి పారిపోయారు. ప్రధానమంత్రి రానిల్ విక్రమ్ సింఘే రాజీనామా చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పొరుగు దేశంలోని ఆర్థిక సంక్షోభ పరిస్థితులపై భారత ప్రభుత్వ వైఖరిని కొందరు విలేకరులు అడిగారు. దీనికి కేంద్ర విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి సమాధానం ఇచ్చారు.

శ్రీలంకకు భారత్ సమీప పొరుగు దేశం అని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలు లోతైన నాగరిక బంధాలను కలిగి ఉన్నాయని వివరించారు. శ్రీలంక, సింహళీయులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై తమకు అవగాహన ఉన్నదని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తున్న శ్రీలంక ప్రజల వెంట భారత్ ఉన్నదని పేర్కొన్నారు.

శ్రీలంకలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను తాము దగ్గరగా చూస్తున్నామని అరిందమ్ బాగ్చి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామిక మార్గంలో రాజ్యాంగబద్ధ వ్యవస్థలు, విలువల చట్రంలోనే తమ ఆశలను, ప్రగతిని సాధించుకోవాలని శ్రీలంక ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. ఈ మార్గంలో శ్రీలంక పౌరుల వెంట భారత్ నిలబడుతుందని పేర్కొన్నారు.

పొరుగు దేశాలకు తొలి ప్రాధాన్యత ఇచ్చే భారత విధానంలో శ్రీలంక కేంద్ర స్థానం ఆక్రమిస్తుందని ఆయన వివరించారు. శ్రీలంక ఎదుర్కొంటున్న తీవ్ర, జఠిల ఆర్థిక పరిస్థితులను అదిగమించడానికి భారత్ ఇప్పటికే సుమారు 3.8 బిలియన్ల అమెరికన్ డాలర్లతో సహకారాన్ని అందించిందని తెలిపారు.

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆ దేశం స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇంతటి సంక్షోభాన్ని చూడలేదు. చమురు సహా ఇతర అత్యవసర సరుకులనూ దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర విదేశీ మారకం లేదు. దీంతో ప్రజలు దిన దిన గండంగా బతుకుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం బంక్‌ల ముందు వాహనాల్లో కిలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నారు. కొందరైతే.. ఈ క్యూలో నిలిపిన వాహనాల్లోనే మరణిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలు శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. ఇది వరకే హింసాత్మక ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రధానిగా మహింద రాజపక్స రాజీనామా కూడా చేశారు. తాజాగా, మరోసారి ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు రాజధాని నగరానికి పోటెత్తారు. 

వేలాది సంఖ్యలో ప్రజలు అధ్యక్షుడు అధికారిక నివాసం వైపుగా బయల్దేరారు. అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనతో అధికారిక నివాసం చేరుకున్నారు. ఈ ఆందోళనల నేపథ్యంలోనే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధికారిక నివాసం నుంచి పారిపోయాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడనేది ఇంకా తెలియదు. అలాగే, ప్రధాన మంత్రి రానిల్ విక్రమ్ సింఘే రాజీనామాాను ప్రకటించారు.