ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాను నిలువరించాలని అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ ఆంక్షల విధింపులో బడా కార్పొరేట్ కంపెనీలూ చేయి కలుపుతున్నాయి. అయితే, రష్యాపై అస్త్రంగా కార్పొరేట్ కంపెనీలను వినియోగించడం సరైన నిర్ణయం కాదని, అది అంతిమంగా ఆ సంస్థలకే దీర్ఘకాలంలో నష్టాలను కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: రష్యా (Russia)ను కట్టడి చేయడానికి అమెరికా (America), యూరప్ దేశాలు (Europe Countries) ఆంక్షలు (Sanctions) విధిస్తామని హెచ్చరించాయి. ఇది వరకే ప్రకటించిన ఆంక్షలను మరింత కఠినతరం చేయాలనే యోచన చేస్తున్నాయి. అయితే, ఆ ఆంక్షలతో తమకు పోయేదేమీ లేదన్నట్టుగా రష్యా ప్రవర్తిస్తున్నది. ఆర్థిక ఆంక్షలతో రష్యాపై యుద్ధం చేస్తామని ఇటీవలే ఫ్రెంచ్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలకు పుతిన్ ప్రభుత్వం గట్టి కౌంటర్ ఇచ్చింది. ఆర్థిక ఆంక్షలే వాస్తవ యుద్ధాలుగా పరిణమిస్తామని హెచ్చరించింది. అయితే, పశ్చిమ దేశాలు మాత్రం రష్యాపై ఆంక్షలు విధించడంలో పునరాలోచనే లేదన్నట్టుగా ఉన్నాయి. అయితే, ఈ ఆంక్షల విధింపు ప్రక్రియలో బడా కార్పొరేట్ (Corporates) కంపెనీలను అస్త్రాలుగా వినియోగించాలనే నిర్ణయం మాత్రం తప్పేనని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆ కంపెనీల దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీస్తాయని పేర్కొంటున్నారు.
ముందుగా రష్యా మార్కెట్ నుంచి తప్పుకున్న కొన్ని మల్టీ నేషనల్ కంపెనీల వివరాలు చూద్దాం. రష్యా మార్కెట్ నుంచి బయటకు వచ్చిన ప్రముఖ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సాబ్రే. రష్యా ప్రభుత్వం మెజార్టీ వాటా ఉన్న ఎయిర్‌లైన్స్‌తో ఈ సంస్థ కాంట్రాక్టును రద్దు చేసుకుంది. అయితే, మిగతా ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ ఆంక్షల్లో పలు ఇంధన సంస్థలూ పాలుపంచుకున్నాయి. రష్యాలో అతిపెద్ద విదేశీ మదుపుదారు బీపీ రష్యా ప్రభుత్వ పరిధిలోని రోస్నెఫ్ట్‌లో 20 శాతం వాటాను వదిలేసింది. నార్వేకు చెందిన ఇక్వినార్ కూడా పెట్టుబడి ఉపసంహరణ మొదలుపెట్టింది. కాగా, జనరల్ మోటార్స్, డైమ్లర్ ట్రక్ కంపెనీలూ ఇందులో చేరాయి. వోక్స్‌వేగన్, వోల్వో, జనరల్ మోటార్స్ సంస్థలు తమ వాహనాలను రష్యాకు పంపిణీ చేయడాన్ని నిలిపేశాయి.
కాగా, మైక్రోసాఫ్ట్ దాని విండోస్ యాప్ స్టోర్ నుంచి రష్యాకు చెందిన ఆర్టీ మొబైల్ యాప్‌ను తొలగించింది. రష్యా ప్రభుత్వ మీడియా యాడ్స్‌నూ నిషేధించింది. అలాగే, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఆర్టీ, ఇతర రష్యన్ చానెళ్లు వాటి యాడ్స్ ద్వారా డబ్బులు పొందకుండా చర్యలు తీసుకున్నాయి.
ఈ ఆంక్షలు సత్ఫలితాలనిస్తాయా? అంటే అనుమానమే అంటున్నారు బెర్క్లిస్ వైస్ ప్రెసిడెంట్ శిశు రంజన్ పేర్కొన్నారు. యాపిల్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లు ఇతర టెక్ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధిస్తే.. అవి దీర్ఘకాలికంగా సొంత ప్రయోజనాలను దెబ్బతీసుకున్నట్టేనని తెలిపారు. ఎందుకంటే.. వీటి ఆంక్షలను ఎదుర్కోవడానికి ఆ దేశమే సొంతంగా వాటికి ప్రత్యామ్నాయ సంస్థలను రూపొందించుకునే అవకాశాలు ఎక్కువ అని వివరించారు. ఎందుకంటే చైనా కూడా ఇలాంటి దారి ఎంచుకున్నదని తెలిపారు.
రష్యా దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ బలగాలు తమదైన తరహాలో ఆ దాడులను ఎదుర్కొంటూ.. రష్యాకు అడ్డుకట్టవేసేలా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకూ 250 రష్యన్ ట్యాంకులను ధ్వంసం చేశామనీ, 10,000 మంది రష్యన్ సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. అలాగే, 33 విమానాలు, 37 రష్యన్ హెలికాఫ్టర్లను కూల్చామని వెల్లడించింది. 939 సాయుధ క్యారియర్లను ధ్వంసం చేశామని, 60 ఫ్యూయల్ ట్యాంకులను పేల్చివేశామని, 18 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వార్‌ఫేర్‌ను ధ్వంసం చేశామని పేర్కొంది.
