Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదం మధ్య ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వైద్య విద్యార్థులను తరలించాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది.
Russia Ukraine Crisis: రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలు ఎంత చెప్పిన వినకుండా రష్యా ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి దిగింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ చిరుటాకులాగా వణుకుతోంది. ఇప్పటికే భారీ మొత్తంలో ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది.
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ వైద్య విద్యార్థులను స్వదేశానికి తిరిగి తీసుకరావడానికి కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. వైద్య విద్యార్థుల కోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని వైద్యమండలి కేంద్రాన్ని కోరింది. యువ విద్యార్థులు సురక్షితంగా తిరిగి రావడానికి ప్రాధాన్యత ఇవ్వాలని IMA జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సహజానంద్ ప్రసాద్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు..
ఉక్రెయిన్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. భయాందోళనలకు గురవుతున్నారు. వారిలో చాలా మంది విమాన ప్రయాణ ఖర్చులను భరించలేని పరిస్థితిలో ఉన్నారు. స్వంత ఖర్చులతో ఇతర ప్రాంతాలకు వేళ్లే స్థోమత కూడా వారిలో చాలా మందికి లేదు. రోజురోజుకు అక్కడ పతిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. చాలా మంది నిత్యవసరాలను కొనలేని స్థితిలో ఉన్నారు. వారి మనుగడకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇక్కడ ఉన్న వారి తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత, శ్రేయస్సు గురించి ఆత్రుతగా మరియు ఆందోళన చెందుతున్నారు. అని తెలిపారు
"భారత పౌరులను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు IMAకి బాగా తెలుసు. ఈ తరుణంలో మా యువ విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత త్వరగా వారిని తిరిగి తీసుకురావాలని, వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, వారిని బయటకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం" అని లేఖలో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడిని ప్రపంచ వైద్య సంఘం (WMA) కూడా తీవ్రంగా ఖండించింది. అత్యంత దుర్మార్గ చర్యగా ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్ల్యూఎంఏ(WMA) కోశాధికారి డాక్టర్ రవి వాంగ్‌ఖేద్కర్ మాట్లాడుతూ.. దేశంలో వైద్యులు,నర్సుల సేవలను, ఆరోగ్య సంరక్షణ సంస్థల తటస్థతను గౌరవించాలని రష్యా నాయకులను కోరారు.
