వాషింగ్టన్: దక్షిణ భారత దేశంలో అయితే మంచి సాంబార్ తో ఇడ్లీ తినడం అంటే చాలా ఇష్టమని  అమెరికాలో ఉపాధ్యక్ష పదవికి  డెమోక్రటిక్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్   లో మీ ప్రశ్నలకు నా సమాధానాలు అనే కార్యక్రమంలో ఆమె పలు విషయాలపై తన అభిప్రాయాలను ఆమె పంచుకొన్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.

ఉత్తర భారతదేశానికి చెందిన ఎలాంటి టిక్కానైనా తనకు నచ్చుతుందని ఆమె సమాధానమిచ్చారు. ఉదయాన్నే లేచిన తర్వాత వ్యాయామం చేస్తానని ఆమె తన రోజువారీ కార్యక్రమం గురించి వివరించారు.

వ్యాయామం పూర్తి చేసిన తర్వాత పిల్లలతో సరదాగా కాలక్షేపం చేస్తానని ఆమె గుర్తు చేసుకొన్నారు. తనకు వంట చేయడమంటే చాలా ఇష్టమన్నారు. తన భర్త డగ్ కు వంట ఎలా చేయాలో నేర్పిస్తానని కూడ ఆమె చెప్పారు.

జీవితంలో ముందుకు వెళ్లడానికి ఎవరి అనుమతి తీసుకోకూడదన్నారు. ఇది నీ సమయం కాదు... ఇప్పుడు నువ్వు కాదు... వంటి తిరస్కారపు మాటలు తన కెరీర్ లో ఎన్నోసార్లు విన్నట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు. 

తనకు కాదు అనే పదాన్ని తాను బ్రేక్ ఫాస్ట్ లోనే తినేస్తానని ఆమె చెప్పారు. మీకు కూడా ఇదే సిఫారసు చేస్తానని ఆమె  చెప్పారు.జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎవరి అనుమతిని తీసుకోవద్దని ఆమె మహిళలకు సూచించారు. తన కెరీర్ లో ఎన్నో తిరస్కారాలకు గురైనట్టుగా చెప్పారు.