ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింత భయానక పరిస్ధితులను సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కారణంగా 1.37 లక్షల మంది మరణించగా, లక్షలాది మంది ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. రోజుల తరబడి ప్రయోగాలు చేస్తున్నప్పటికీ పరిశోధకులు మాత్రం ఇప్పటి వరకు టీకాను కొనుక్కోలేకపోయారు. 

అయితే చీకటిలో చిరుదీపంలా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కరోనా రోగులకు అందించడం వల్ల సత్ఫలితాలు కనిపించాయని పలు దేశాల పరిశోధకులు చెబుతున్నారు.

Also Read:మీకోసం మేము ప్రార్థిస్తున్నాం.. బ్రిటన్ ప్రధాని భార్యతో మెలానియా ట్రంప్

దీంతో ఈ డ్రగ్‌కు ఎక్కడా లేని గిరాకీ ఏర్పడింది. దీని ఉత్పత్తి, నిల్వలు, సరఫరాలో ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండటంతో అన్ని దేశాలు మనదేశంవైపు క్యూకడుతున్నాయి.

సుమారు 30 దేశాలు తమకూ ఆ డ్రగ్‌ను పంపించాలని భారత్‌ను చేతులెత్తి వేడుకుంటున్నాయి. అమెరికా ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌డీఏ సైతం కరోనాకు ఈ మందును వినియోగించవచ్చునని సూచించింది.

అయితే మలేరియాను కట్టడి చేసే ఈ డ్రగ్ కరోనా వైరస్‌ను పూర్తిగా తగ్గించడంలో ఏమంత ప్రభావంతంగా పనిచేయట్లేదని చైనా నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. ఈ పరిశోధనలో భాగంగా ఒక ఆసుపత్రిలోని 150 మంది కరోనా పేషెంట్లను ఎంపిక చేసుకుని రెండు గ్రూపులుగా విభజించారు.

Also Read:అమెరికాలో 30వేలు దాటిన మరణాలు.. గంటకు 107మంది మృతి

అందులో ఒక గ్రూపుకు సాధారణ చికిత్సను అందించగా మిగిలిన వారికి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇచ్చారు. అనంతరం ఈ రెండు గ్రూపుల ఫలితాలను పరీక్షించగా ఈ యాంటీ మలేరియా డ్రగ్ వైరస్‌ల స్థాయిని కొంత వరకే తగ్గించగలిగిందని, ప్రామాణిక చికిత్స కన్నా మరింత మెరుగ్గా పనిచేయలేదని పెదవి విరిచారు. మరికొందరు నిపుణులు సైతం దీని మోతాదు మించితే రోగుల్లో గుండెపోటు వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు.