డాక్టర్ల వద్ద పనిచేసే నర్సులు, కాంపౌండర్లు, ఇతర సిబ్బంది సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడి వైద్యులుగా నమ్మబలికి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యూట్యూబ్‌లో, వెబ్‌సైట్‌లో చూసి ఏకంగా సర్జరీలు కూడా చేసేస్తున్నారు. ఎంత నిఘా పెట్టినా కొందరు మాత్రం దందా కొనసాగిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు. 

తాజాగా పాకిస్థాన్‌లోని లాహోర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తాను డాక్టర‌ునంటూ చెప్పి.. రోగికి శస్త్రచికిత్స చేశాడు. అయితే బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. ఆమెకు సర్జరీ చేసిన వ్యక్తి గతంలో ఆదే ఆస్పత్రిలో సెక్యురిటీ గార్డుగా పనిచేసేవాడని తేలడంతో మృతురాలి బంధువులు షాక్‌కు గురయ్యారు. లంచాలు మరిగిన అతడిని ఆస్పత్రి యాజమాన్యం రెండేళ్ల క్రితమే విధుల నుంచి తొలగించింది. 

Also Read:పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 30మంది మృతి...

వివరాల్లోకి వెళితే.. షమీనా బేగం అనే వృద్ధురాలి వీపుపై గాయంతో బాధపడుతుండటంతో ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో తనను డాక్టర్‌గా పరిచయం చేసుకున్న నిందితుడు శస్త్రచికిత్స చేసి నయం చేస్తానని నమ్మబలికాడు. నిజమేనని నమ్మిన మృతురాలి బంధువులు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్‌గా కొంత డబ్బు తీసుకున్న అతడు రెండు వారాల క్రితం ఆ ఆస్పత్రిలోనే శస్త్రచికిత్స చేశాడు. అతనికి ఆపరేషన్ థియేటర్‌లో ఓ టెక్నీషియన్ కూడా సాయం చేశాడు.

సర్జరీ తర్వాత రెండు సార్లు బాధితురాలి ఇంటి వెళ్లిన నిందితుడు ఆమె గాయానికి కట్టుకట్టి వచ్చాడు. అయితే ఆదివారం ఉన్నట్లుండి ఆమె ఆరోగ్యం విషమించడంతో మృతి చెందింది. ఆమె భౌతికదేహం ప్రస్తుతం మార్చరీలో ఉంది. వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఆమె ఏ కారణంతో మృతిచెందిందో నిర్ధారించాల్సి ఉంది. సర్జరీ జరిగిన ఆసుపత్రిలోని ఓ అధికారి మాట్లాడుతూ.. ఇది చాలా పెద్ద ఆసుపత్రని ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారో కనిపెట్టడం కష్టమని వెల్లడించారు. ప్రస్తుతం ఆ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే.. పాకిస్థాన్ ప్రభుత్వాస్సత్రుల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంటాయని, పని జరగాలంటే అక్కడి రోగులు, వారి బంధులు ఆస్పత్రి సిబ్బందికి లంచాలు ఇవ్వాల్సిందేనని స్థానిక మీడియా కథనం.