Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఈ భౌతిక దూరం సరిపోతుందా? హాంకాంగ్ హోటల్ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనలో ఆందోళనకర విషయాలు

ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే కూడా వేగంగా వ్యాపిస్తుందన్న విశ్లేషణలు వస్తున్న తరుణంలో హాంకాంగ్‌లోని ఓ క్వారంటైన్‌లో హోటల్‌లో రెండు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చేపట్టిన అధ్యయనం కీలక విషయాలను వెల్లడిస్తున్నది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను ఈ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంచగా, వారు బయటకు రానేలేదు.. పరస్పరం కలుసుకోలేదు. కేవలం ఆహారాన్ని అందించడానికి, టెస్టులు చేయడానికి మాత్రమే వారి గది తలుపులు తీసినట్టు సీసీటీవీ ఫుటేజీ స్పష్టం చేస్తున్నది. అయినప్పటికీ వారిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఫలితాలు వచ్చాయి. వారిద్దరి గదుల డోర్లు తీసినప్పుడు ఆ వేరియంట్ గాలి ద్వారా సోకి ఉండవచ్చని హాంకాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

hongkong hotel cctv footage says how omicron can spread
Author
New Delhi, First Published Dec 6, 2021, 4:47 PM IST

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి(Corona) తొలిసారిగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో వైరస్ కట్టడి చర్యల్లో మాస్కులు, భౌతిక దూరం కీలకంగా ఉన్నాయి. ఆరు ఫీట్ల దూరం పాటించాలని నిపుణులు చెప్పారు. వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తుంపర్ల రూపంలో వాతావరణంలో కలిసే వైరస్ అణువులు ఆరు ఫీట్ల దూరానికి మించి ప్రయాణించలేవని అప్పుడు వారి అంచనా. ఆ తర్వాత ఈ దూరంపైనా అడపా దడపా చర్చలు జరిగాయి. కొందరైతే.. ఈ వైరస్ కేవలం తుంపర్ల రూపంలో ప్రయాణించడమే కాదు.. గాలిలోనూ చాలా దూరం వెళ్లగలిగే సామర్థ్యం గలదని వాదించారు. ఈ చర్చలు సాగుతున్నా డెల్టా వేరియంట్ మాత్రం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నది. తాజాగా, దక్షిణాఫ్రికాలో తొలిసారిగా నమోదైన ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) డెల్టా(Delta) వేరియంట్ కంటే వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే హాంకాంగ్‌లో ఓ సీసీటీవీ ఫుటేజీ పరిశీలనతో ఓ అధ్యయనం ఇప్పుడు భౌతిక దూరంపై మరోసారి చర్చను ముందుకు తెచ్చింది.

హాంకాంగ్‌లోని ఓ క్వారంటైన్ హోటల్ హాల్‌వే ద్వారా వైరస్ వ్యాపించినట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. ఆ హోటల్‌లో ఇద్దరు విదేశీ ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచారు. సీసీటీవీ ఫుటేజీల ద్వారా వారిద్దరూ అసలు బయటకే రాలేదని స్పష్టంగా తెలిసింది. వారిద్దరు ఒకరినొకరు కలుసుకోలేదు. ఇద్దరు వేర్వేరు రోజుల్లో హాంకాంగ్‌లో దిగడం మూలంగా వారికి టెస్టులూ వేర్వేరు రోజుల్లోనే చేశారని స్పష్టం అవుతున్నది. కేవలం కరోనా టెస్టులు చేయడానికి, లేదా ఆహారం కోసం మాత్రమే వారి గదుల డోర్లు తీశారు. అంత జాగ్రత్తగా క్వారంటైన్ నిబంధనలు పాటించినప్పటికీ వారిద్దరికీ ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ అని తేలిందని ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీస్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. ఒమిక్రాన్ వేరియంట్ గాలి ద్వారా హోటల్ హల్‌లో ప్రయాణించి ఈ రెండు గదుల్లోకి చేరి ఉండవచ్చని ఆ అధ్యయనం భావించింది. ఆహారం కోసం లేదా టెస్టుల కోసం డోర్లు తీసినప్పుడు ఆ గదుల్లోకి వేరియంట్ ప్రవేశించి ఉండవచ్చని, తద్వారా వారిద్దరూ ఆ వేరియంట్ బారిన పడ్డారని ఆ అధ్యయనం పేర్కొంది. వారిద్దరూ రెండు డోసుల టీకాలు వేసుకుని ఉన్నట్టు ఈ అధ్యయనం చేపట్టిన హాంకాంగ్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు.

Also Read: Omicron: డెల్టా కంటే ప్రమాదకరం కాకపోవచ్చు.. అమెరికా ఆంక్షలు ఎత్తేస్తుంది.. టాప్ సైంటిస్టు ఫౌచీ

డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న తరుణంలో వైరస్ గాలి ద్వారా ప్రయాణించే అవకాశం ఉన్నదని పలు పరిశోధనాత్మక అధ్యయనాలు వచ్చాయి. తాజాగా, మరోసారి ఒమిక్రాన్ వేరియంట్‌ అదే విధంగా గాలి ద్వారా సోకే అవకాశం ఉన్నదనే అధ్యయనం ప్రచురితమైంది. డెల్టా కంటే ఒమిక్రాన్‌లో ఎక్కువ ఉత్పరివర్తనాలు ఉండటంతో ఈ వేరియంట్‌పై ప్రస్తుత వ్యాక్సిన్ సామర్థ్యాలపై చర్చ జరిగింది. కొందరు నిపుణులు ఒమిక్రాన్ వేరియంట్‌ను ప్రస్తుత టీకాలు అడ్డుకోలేవన్న అభిప్రాయాలూ వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలోనే సుమారు 450 మంది శాస్త్రజ్ఞులు వ్యాక్సిన్ సామర్థ్యంపై ఈ వేరియంట్ ప్రభావాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు మొదలు పెట్టారు. మరికొన్ని రోజుల్లో వారి అధ్యనాలు వెలువడవచ్చు. రెండు డోసులు వేసుకున్న వారికి హోటల్ కారిడార్ మాత్రమే అనుసంధానం గల రెండు గదుల్లోని వ్యక్తులకు గాలి ద్వారా ప్రయాణించి ఈ వేరియంట్ సోకడం దాని సామర్థ్యాన్ని వెల్లడిస్తున్నదని ఈ అధ్యయనంలో పాల్గొన్న హావోగావో గు, లియో పూన్ పేర్కొన్నారు. దీంతో మనం పాటించే భౌతిక దూరం ఒమిక్రాన్ వేరియంట్ నుంచి తప్పించుకోవడానికి సరిపోతుందా? అనే చర్చ మొదలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios